రాజమౌళి, కమ్ముల రూటేవేరు
కుటుంబ పాలన ఇంకెంతకాలం, మార్పును ఆహ్వానిద్దాం అంటూ లోక్ సత్తా అధినేత జె.పి. ఎన్నికల నినాదానికి పరిశ్రమ ప్రముఖుల నుంచి సైతం ఇప్పుడు సానుకూల స్పందన లభిస్తోంది. మేథావుల పార్టీగా మాత్రమే ప్రచారంలో ఉన్న లోక్ సత్తా జనవాణిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గట్టి కసరత్తే చేస్తోంది. ఈ నేపథ్యంలో తొలి విడత ప్రచారం చివరి రోజైన సోమవారంనాడు శేరిలింగపల్లిలో ఆ పార్టీ తరఫున జరిగిన రోడ్ షోలో ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పాల్గొని నైతిక విలువలు చాటిచెబుతున్న లోక్ సత్తా పార్టీకి అండగా నిలబడాలని ప్రచారం చేశారు. మార్పు కోసం పాటుపడుతున్న ఆ పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినీ సెలబ్రెటీలు పలువురు లోక్ సత్తా తరఫున పబ్లిక్ గా ప్రచారానికి రాకపోయినా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఆ పార్టీకి మద్దుతు ఇవ్వబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించిన తరుణంలో సినీ పరిశ్రమ అంతా ఆయనకు అండగా నిలుదిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే చిరంజీవి కుటుంబ సభ్యులే ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణ అవుతూ వచ్చారు. చివరి నిమిషంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం 'రైలు యాత్ర' ద్వారా ప్రచారరంగంలోకి దిగారు. పరిశ్రమ నుంచి కృష్ణంరాజు, పోసోని పార్టీలోకి వచ్చి ఆ పార్టీ తరఫు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. టిడిపి తరఫున గతంలో మద్దతిచ్చిన పలువురు సినీ ప్రముఖులు మళ్లీ ఆ పార్టీకి అండగా నిలుస్తుండగా, నందమూరి హీరోలు పార్టీని భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గట్టి సపోర్ట్ లభిస్తోంది. కృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, జయసుధ, శారద, రాజశేఖర్-జీవిత...ఇలా పెద్ద బెటాలియనే పార్టీకి సినీ గ్లామర్ జోడిస్తోంది. అనూహ్యంగా ఇప్పుడు...పరిశ్రమలోనూ, వ్యక్తిగతంగానూ అందరితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ మనసుకు నచ్చిన లోక్ సత్తా పార్టీకి మద్దతు తెలపడం ద్వారా రాజమౌళి, శేఖర్ కమ్ముల సైతం తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
Be first to comment on this News / Article!
|