బాలీవుడ్ కు కమలిని 'నో'
హీరోయిన్లు సహజంగా ఎన్ని ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించినా అంతిమ గమ్యం మాత్రం బాలీవుడ్ లో అడుగుపెట్టడమే అవుతుంటుంది. శ్రియ, ఆసిన్, జెనీలియా వంటి వారు ఇప్పుడు బాలీవుడ్ లోనూ తమ డిమాండ్ ను చాటుకుంటున్నారు. ఇదే తరుణంలో దక్షిణాదికి చెందిన మరికొందరు అందగత్తెలు సైతం అటువైపు మళ్లుతారనే అంచనాలు ఉన్నాయి. అయితే తన గమ్యం బాలీవుడ్ మాత్రం కాదనీ, బెంగాలీ అనీ చెబుతోంది కమలినీ ముఖర్జీ.
'ఆనంద్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన కమలిని ముఖర్జీ ఇవాల్డి గ్లామర్ ట్రెండ్ లో భిన్నంగా విలక్షణ పాత్రలకే మొగ్గుచూపుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'గోదావరి' చిత్రం కమిలినికి మరో మంచి హిట్ ఇస్తే 'గమ్యం' చిత్రం కమలిని గమ్యాన్నే మార్చేసింది. తెలుగులో ఈ చిత్రం మంచి హిట్ సాధిస్తే, ఈ చిత్రం తమిళ వెర్షన్ లోనూ కమలిని నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ సాధిస్తుంది. అనూహ్యంగా ఇప్పుడు 'గమ్యం' కన్నడ వెర్షన్ 'సవారి'లోనూ కమలిని ఎంపికైంది. ప్రతి వెర్షన్ లోనూ తనను హీరోయిన్ గా ఎంచుకున్న దర్శకులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాననీ, ఇంతకంటే ఏ నటికైనా వచ్చే గుర్తింపు ఏముంటుందని కమలిని సంబరం వ్యక్తం చేస్తోంది. 'కన్నడ వెర్షన్ లో నన్ను ఎంపిక చేసిన క్రెడిట్ ఆ చిత్ర దర్శకుడు జాకో వర్గసేకి దక్కుతుంది. గమ్యం సినిమా నా చేతికి వచ్చినప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో...కన్నడ వెర్షన్ లో అవకాశం వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ అనుభూతి చెందాను' అని చెప్పుకొచ్చింది. కన్నడంలో అవకాశం రావడం ద్వారా తమిళ, తెలుగు, మలాయాళంతో సహా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించినట్టు అవుతుందనీ, ఇప్పుడున్న పొజిషన్ తనకు హ్యాపీగా ఉందనీ, బాలీవుడ్ పై దృష్టి సారించేది లేదనీ చెప్పుకొచ్చింది. అయితే ఒక బెంగాలీ సినిమాలో నటించాలని మాత్రం ఉందంటూ తన మనసులోని కోరికను ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బయటపెట్టింది. ఆ కోరిక కూడా త్వరలోనే తీరుతుందని అనుకోవచ్చు. ప్రస్తుతం కమిలిని తెలుగులో నటించిన 'పోలీస్ పోలీస్' విడుదలకు సిద్ధంగా ఉంది. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న'గోపి గోపిక గోదావరి' గుట్టుచప్పుడు కాకుండా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
Be first to comment on this News / Article!
|