'గోపి గోపిక గోదావరి' పూర్తి
క్రియేటివీకి అర్ధం చెప్పిన దర్శకులలో వంశీ ఒకరు. 'సితార', 'అన్వేషణ', 'మంచుపల్లకి', 'లేడీస్ టైలర్', 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' వంటి వైవిధ్య భరితమైన చిత్రాలను ఆయన గతంలో అందించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ అంత ఫలప్రదంగా సాగడం లేదు. 'దొంగరాముడు అండ్ పార్టీ', 'కొంచెం టచ్ లో ఉండే చెబుతాను', 'అనుమానాస్పదం' చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో సైలెంట్ గా మళ్లీ వరుస హిట్లు కొట్టేందుకు వంశీ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన దర్శకత్వం వహిస్తున్న 'గోపి గోపిక గోదావరి' చిత్రం గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తాజా సమాచారం. వేణు, కమలిని ముఖర్జీ జంటగా గత నవంబర్ 4న ఈ చిత్రం ప్రారంభమై కోనసీమలో ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో మహర్షి సినిమా బ్యానర్ పై వల్లూరి పల్లి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కోనసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను వంశీ తెరకెక్కించారు. సినిమా ప్రోగ్రస్, ప్రెస్ మీట్లకు దూరంగా ఉండే వంశీ నేరుగా ఆడియో రిలీజ్ ద్వారా చిత్ర విశేషాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు, లోకి బి. గౌడ్ సినిమాటోగ్రఫీ, బస్వా పైడిరెడ్డి ఎటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వంశీ రెండు కొత్త సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా రవితేజ కథానాయకుడిగా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ బ్యానర్ లో చేయనున్నారు. దీనికంటే ముందు అల్లరి నరేష్ హీరోగా మరో చిత్రానికి కూడా వంశీ ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|