ఎన్టీఆర్ 'అదుర్స్' డిలే...
'అది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు వి.వి.వినాయక్ కలిసి పనిచేస్తున్న 'అదుర్స్' చిత్రం సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశాలు ఇక లేనట్టే. ఎన్నికల ప్రచార బరిలోకి ఎన్టీఆర్ దిగకముందు ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంది. . అయితే 40 రోజుల పాటు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార బరిలోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఊహించని విధంగా ఆయన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో వైద్యులు మరో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరింత డిలే అయ్యే అవకాశాలున్నాయని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్, ఆయన జోడిగా నటిస్తున్న నయనతార, సెకెండ్ హీరోయిన్ షీలాపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు ప్లాన్ చేశారనీ, తాజా పరిణామాల దృష్ట్యా ఎన్టీఆర్ తో నటించాల్సిన ఆర్టిస్టులను రెండు నెలల పాట్లు డేట్లు సర్దుబాటు చేయాలని దర్శకుడు సూచించారనీ వారు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూన్ నెలాఖరులో మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఉండొచ్చనీ, ఈసారి ఎప్పుడు షెడ్యూల్ మొదలైనా సినిమా పూర్తయ్యేంతవరకూ నాన్ స్టాప్ షెడ్యూల్ ఉంటుందనీ యూనిట్ వర్గాల సమాచారం. కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోనవెంకట్ కథ, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|