'నచ్చావ్ అల్లుడు' ఆడియో
హాస్యనటుడు ఆలీ కథానాయకుడుగా శ్రీ సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి నిర్మిస్తున్న హాస్యరస చిత్రం 'నచ్చావ్ అల్లుడు'. ఎం.ఎస్.శ్రీచంద్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సోమవారం రాత్రి ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసి బి.గోపాల్ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి ప్రతిని ఆలీకి అందజేశారు. కోటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
బి.గోపాల్ మాట్లాడుతూ, ఆలీ అంటే తనకు ఎంతో ఇష్టమనీ, 'యమలీల' నుంచి హీరోగా పలు హిట్లు ఇచ్చారనీ చెప్పారు. ఈ సినిమా టైటిల్ కూడా చాలా బాగుందనీ, నిర్మాతలు ఎంతోకాలంగా తనకు తెలుసనీ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారనీ అన్నారు. ఆడియోతో సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. సీనియర్ దర్శకుడు శరత్ మాట్లాడుతూ, తన శిష్యుడైన శ్రీచంద్ కు దర్శకుడిగా ఈ చిత్రం మంచి సక్సెస్ ఇవ్వాలని అభిలభించారు. నిర్మాతలు కొత్తవారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమాను పూర్తి చేశారని ఆలీ తెలిపారు. బ్యాంకాక్ లో మూడు పాటలు చిత్రీకరించారనీ, అలాగే నంది అవార్డు గ్రహీత ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం ఈ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయన్నారు. పరిశ్రమలోని కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులంతా ఈ సినిమాలో నటించారని సీనియర్ నటుడు చలపతిరావు పేర్కొనగా, ఇందులో తాను అమితాబ్ సర్కార్ తరహా గెటప్ లో కనిపిస్తానని నటుడు రఘుబాబు తెలిపారు. దర్శకుడు శ్రీచంద్ మాట్లాడుతూ, గతంలో తాను బి.గోపాల్, శరత్ ల వద్ద పనిచేశాననీ, అందరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాననీ చెప్పారు. ఉషా సింగశెట్టి, చిత్ర సమర్పకుడు డాక్టర్ విజయ్ సింగంశెట్టి, నటుడు గుండు సుదర్శన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|