'ఆ...ఒక్కడు' రొమాన్స్
విలన్ పాత్రలతో ఇంతవరకు ప్రేక్షకులను అలరించిన అజయ్ తొలిసారిగా 'ఆ...ఒక్కడు' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. టాలీ టు హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడు.అజయ్ సరసన మధురిమి నాయికగా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం ఓ రొమాంటిక్ సాంగ్ ను బ్యాంకాక్ లోని పలు సుందర ప్రదేశాల్లో తీశారు. ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
'పస్ట్ టైమ్ చూసినప్పుడు నువ్వంటే ఇష్టంలేదులే..' అనే పాటను ఈమధ్యనే బ్యాంకాక్ లో అజయ్, మధురిమిలపై చిత్రీకరించామనీ, భాస్కరభట్ల రాసిన పాటకు హరీష్ పాయ్ నృత్యరీతులు సమకూర్చారనీ నిర్మాత గణేష్ ఇందుకూరి తెలిపారు. ఈనెల 20 వరకూ జరిగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుందన్నారు. లవ్, సెంటిమెంట్, వినోదం వంటి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయనీ, పాత్రధారుల క్యారెక్టరైజేషన్ చాలా వైవిధ్యంగా ఉంటుందనీ చెప్పారు. అజయ్ పాత్రకు ఇచ్చిన ట్రీట్ మెంట్, వైద్యురాలిగా నాయిక మధురిమి, క్రిమినల్ లాయర్ గా సురేష్ గోపి పాత్రలు గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సునీల్, నాజర్, విజయ్ చందర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, బాలయ్య, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్.ఎస్.మూర్తి కథ, సురేంద్రకృష్ణ మాటలు, కమలాకర్ సినిమాటోగ్రఫీ, గణేష్ ఫైట్స్, వర్మ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సహనిర్మాత సుధాకర్ చాగంటి.
Be first to comment on this News / Article!
|