అలరిస్తున్న'ఆనందతాండవం'
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన 'ఆనంద తాండవం' చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందని ఆ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎస్.వి.ఆర్. మీడియా అధినేత్రి శోభారాణి తెలిపారు. ఆస్కార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.ఆర్.గాంధీ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు ఈ చిత్రం సక్సెస్ మీట్ ను ఆమె ఏర్పాటు చేశారు.
ఆస్కార్ ఫిలింస్ అనగానే క్వాలిటీకి మరో పేరనే విషయం అందరికీ తెలిసిందనేననీ, మొదట్నించీ సందేశాత్మక చిత్రాలను సంస్థ అందిస్తూ వచ్చిందనీ అన్నారు. అదే తరహాలో చక్కటి ప్రేమ సందేశంతో 'ఆనందం తాడవం' చిత్రం రూపొందిందనీ, సినిమా బాగుందంటూ అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. పాశ్చాత్య వ్యామోహంలో చిక్కుకుని విదేశాలకు వెంపర్లాడుతున్న వారికి ఇందులో మంచి సందేశం ఉందనీ, పాటలకు కూడా మంచి పేరొచ్చిందనీ ఆమె తెలిపారు. గీత రచయిత వనమాలి మాట్లాడుతూ, ఇందులో రెండు సందర్భోచితమైన పాటలు రాశాననీ, రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందించారనీ అన్నారు. తనతో పాటు భువనచంద్ర రెండు, సుద్దాల అశోక్ తేజ ఒక పాట రాశారనీ, పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయనీ చెప్పారు. ఆస్కార్ బ్యానర్ లో వచ్చిన మరో మంచి చిత్రంగా 'ఆనంద తాండవం' పేరు తెచ్చుకుటోందన్నారు.
Be first to comment on this News / Article!
|