మళ్లీ సెట్స్ కు 'కొమురం పులి'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ నెల 23 తర్వాత మళ్లీ 'కొమురం పులి' రెగ్యులర్ షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. 'యువరాజ్యం' అధ్యక్షుని హోదాలో విస్తృత ప్రచారం చేపట్టిన ఆయన రెండ్రోజుల క్రితం వడదెబ్బ కారణంలో ఆసుపత్రిలో చేరి ఇప్పుడు డిశ్చార్స్ అయ్యారు. ప్రజారాజ్యం తరఫున రెండో విడత ప్రచారానికి కూడా కమిట్ అయినందున అది పూర్తి అయిన వెంటనే 'కొమురం పులి' షూటింగ్ లో జాయిన్ అవుతానని ఆయన తెలియజేశారు.
ఎన్నికల సర్వేల గురించి ప్రసావిస్తూ ఇండియాలో మీడియా జరిపే ప్రీ-పోల్స్ సర్వేలు వాస్తవానికి అద్దం పట్టవనీ, ఈ ఎన్నికల్లో చిరంజీవి విజేతగా నిలవడం ఖాయమనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఎన్ డిఓ అధికారంలోకి వస్తుందనీ మెజారిటీ సర్వేలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనీ, ఇలాంటి సర్వేల గురించి తమకెంత మాత్రం ఆందోళన లేదనీ, తాము (పిఆర్పీ) అధికారంలోకి రావడం ఖాయమనీ ఆయన జోస్యం చెప్పారు. చిరంజీవి అధికారం చేపట్టినా తాను మాత్రం సినిమాల్లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు. 'కొమురం పులి' చిత్రం అనుకున్న విధంగానే షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. పవన్ తో గతంలో 'ఖుషీ' వంటి సెన్సేషన్ హిట్టిచ్చిన ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకూ ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు పట్టుదలగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నికిషా పటేల్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా, మనో జ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్యం, నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|