రజనీకాంత్ క్లాప్ తో 'చైత్రం'
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 'వీధి' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజువుపాటి తాజాగా 'చైత్రం' అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి 'ది సీజన్ ఆఫ్ లవ్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. రాకేష్ సినీ సర్క్యూట్ బ్యానర్ పై విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ఫిల్మ్ సిటీలోనే 'రోబో' షూటింగ్ లో పాల్గొంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ హాజరు కావడం విశేషం. నూతన హీరో సూర్య, సీనియర్ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావుపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి రజనీకాంత్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శేఖర్ వి.జోషఫ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. 'తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి...సో ఆల్ ద బెస్ట్' అనే డైలాగ్ ను ముహూర్తం షాట్ గా చిత్రీకరించారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా సూర్య అనే కొత్త హీరో, మరో ఇద్దరు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తున్నామనీ, మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, కారంచేడు, పొల్లాచి, మలేసియా, హైద్రాబాద్ లలో షూటింగ్ జరుపుతామని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ లు ఈ చిత్ర ముహూర్తానికి రావడం తమ అదృష్టమనీ, జీవితంలోని వివిధ దశలను అందంగా చెప్పే ఒక మంచి ప్రేమకథా చిత్రమే ఈ 'చైత్రం' అని దర్శకుడు రాజువుపాటి తెలిపారు. చైత్రంలో ఆకులు చిగురించినట్టే ఇందులో ప్రేమ చిగురుస్తుందనీ, 80 శాతం కామెడీ, 20 శాతం హృదాయలను కదిలించే సన్నివేశాలతో సినిమా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రానికి రమేష్-గోపి సంభాషణలు, చంద్రబోస్ పాటలు, శేఖర్ వి.జోసఫ్ సినిమాటోగ్రఫీ, తోట తరణి కళా దర్శకత్వం, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, బాలు సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|