ఏ 'డైరీ'లో ఏముంది?
సమ్మర్ సీజన్ వస్తోందంటే పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి ఆ వేడి అంతగా ఉండదనే చెప్పుకోవాలి. బాలకృష్ణ 'మిత్రుడు', రామ్ చరణ్ 'మగధీర', రవితేజ 'కిక్' చిత్రాలు మినహాయిస్తే మహేష్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి హీరోలు సమ్మర్ కు దూరంగా ఉండబోతున్నారు. ఇదే అదనుగా పలు చిన్న సినిమాలు సైతం అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆసక్తికరంగా టైటిల్ కు దగ్గర సామీప్యం ఉన్న రెండు చిన్న సినిమాలు ఏకకాలంలో వచ్చే వారంలో పోటీకి సిద్ధపడుతున్నాయి. వీటిలో ఒకటి శివాజీ 'డైరీ' అయితే, మరొకటి ఛార్మి 'కావ్యాస్ డైరీ'. ఈ రెండు సినిమాలు నిజానికి గత నెలలోనే విడుదల కావలసి ఉండగా, కారణాంతరాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ఒకే వారంలో తలపడుతుండటం యాదృచ్ఛికం కూడా కావచ్చు.
ఛార్మి, శివాజీ కలిసి నటించిన 'మంత్ర' ఆమధ్య మంచి సక్సెస్ సాధించింది. అయితే సినిమా క్రెడిట్ లో ఎక్కువ వాటా ఛార్మి దక్కించుకుంది. ఇప్పుడు అదే 'మంత్ర' ఫిల్మ్ మేకర్స్ నుంచే 'డైరీ' చిత్రం రూపొందింది. శివాజీ సోలో హీరో కాగా, ఆయకు జోడిగా శ్రద్ధాదాస్ నటించింది. ఇక 'కావ్యాస్ డైరీ' లో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మరో కీలక పాత్రను నటి, నిర్మాత, మహేష్ బాబు సోదరి మంజుల పోషిస్తోంది. మంజుల భర్త సంజయ్ స్వరూప్ నిర్మాత. డైరీ చుట్టూ అల్లుకున్న మిస్టీరియస్ సంఘటనల ఇతివృత్తంతోనే ఈ రెండు చిత్రాలు నిర్మాణం కావడం ఒక దగ్గర పోలికైతే, టైటిల్స్ మరీ దగ్గర్లో ఉండటం ఇంకో పోలిక. 'డైరీ' చిత్రాన్ని గత ఉగాదికి విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 24న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. 'కావ్యాస్ డైరీ' చిత్రాన్ని ఈనెల 23న రెండో విడత ఎన్నికల అనంతరం విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ రెండింటికీ మరో ముచ్చటైన పోలిక ఏమిటంటే ఇవి థ్రిల్లర్ సినిమాలు కావడం. దాదాపు ఒకే తరుణంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ రెండింటిలో ఏ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందో చూడాలి.
Be first to comment on this News / Article!
|