జగపతిబాబు జంట రిలీజులు
'ప్రైమ్ స్టార్' ఇమేజ్ ను సొంతం చేసుకున్న జగపతిబాబు ఇంచుమించు వారం రోజుల తేడాలో రెండు కొత్త రిలీజులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ రెండు సబ్జెక్ట్ పరంగా, ఆయన క్యారెక్టర్ల పరంగా వైవిధ్యంతో కూడుకున్న చిత్రాలే కావడం విశేషం. రాజకీయ నేపథ్యంలో జగపతిబాబు నటించిన 'అధినేత' చిత్రం వచ్చే వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే జగపతిబాబుకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ కు దగ్గరగా రూపొందిన సకుటుంబ కథా చిత్రం 'బంగారుబాబు' మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.
కేవలం మూడు నెలల షూటింగ్ షెడ్యూల్ తో 'అధినేత' చిత్రాన్ని దర్శకుడు వి.సముద్ర తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నికల కంటే ముందుగా ఈనెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల దృష్ట్యా విడుదల తేదీ వాయిదా పడింది. అయితే ఎన్నికల ఫీవర్ పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే ఈనెల చివరివారంలో సినిమా విడుదలకు సన్నహాలు జరుగుతున్నాయి. కాగా 'బంగారుబాబు' చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించామనీ, తమ బ్యానర్ ప్రతిష్టను ఈ చిత్రం మరింత పెంచుతుందనీ నిర్మాత కె.రామకృష్ణ ప్రసాద్ చెబుతున్నారు. మేడే కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం అందించారు. దాదాపు ఏకకాలంలో విడుదలవుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం ఎక్కువ స్కోరింగ్ చేస్తుదనేది ఆసక్తి కలిగిస్తోంది.
Be first to comment on this News / Article!
|