జంట 'తాండవం'
ఎవరి పిల్ల వారికి ముద్దంటారు. ఇందులో తప్పులేదు. అయితే మన పిల్ల అందరికీ ముద్దవ్వాలని మాత్రం రూలేం లేదు. 'అపరిచితుడు', 'దశావతారం' వంటి సెన్సేషన్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల మానవ సంబంధాలపై తీస్తున్న సినిమాలు క్లాస్ ను ఒప్పిస్తున్నా, మాస్ ను మెప్పించలేకపోతున్నాయి. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ' చిత్రం ఇదే కోవలోకి వెళ్లే, తాజాగా ఆయన ఎన్నో అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసిన 'ఆనంద తాండవం' చిత్రం కూడా రెండు భాషల్లోనూ దాదాపు ఇదే ఫలితాన్ని చూపిస్తోందని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ఆ మాటెలా ఉన్నా...'ఆనంద తాండవం' పెయిర్ తోనే తన తదుపరి చిత్రానికి కూడా ఆస్కార్ రవిచంద్రన్ కమిట్ అయిపోయారు. అంటే కొత్త హీరో సిద్దార్ద్, తమన్నా కలిసి మరో సినిమాలో నటించబోతున్నారని అనుకునేరు. ఎంత మాత్రం కాదు. సిద్దార్ధ, రుక్ష్మిణి జంటగా ఆ సినిమా ఉండబోతోంది.
'ఆనంద తాండవం'లో తమన్నా పూర్తి స్థాయి పాత్ర పోషించినా...మోడ్రన్ గాళ్ గా కనిపిస్తూనే ఇండియన్ సాంప్రదాయాలను పుణికిపుచ్చుకునే అమ్మాయి పాత్రలో రుక్ష్మిణి నటించింది. తమన్నాను ప్రేమించి ఆమెకు వేరే అతనితో పెళ్లయినప్పటికీ ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించే సిద్దార్ధను తనవైపు తిప్పుకునే పాత్రను రుక్ష్మిణి ఇందులో పోషించింది. సిద్దార్ద్ - రుక్ష్మిణి మధ్య స్క్రీన్ కెమెస్ట్రీ చాలా బాగుందని నిశ్చయించిన ఆస్కార్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రానికి ఈ ఇద్దర్నీ బుక్ చేశారు. జీవాశంకర్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఏతావాతా 'ఆనంద తాండవం' తమన్నాకు పెద్దగా మేలు చేయకపోయినా మళ్లీ ఆస్కార్ బ్యానర్ లో నటించే అవకాశాన్ని మాత్రం రుక్ష్మిణికి దక్కించింది.
Be first to comment on this News / Article!
|