ప్రిన్స్ 'డబుల్' స్పీడ్
మహేష్ బాబు స్ప్రింట్ కొడితే జనం ఊపిరి బిగపడతారు. 'ఒక్కడు'...'అతడు'...'పోకిరి' వరకూ మహేష్ బాబు స్పీడ్ కు బ్రేక్ లేదు. అయితే 'అతిథి' స్పీడ్ బ్రేకర్ అయింది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత ఎట్టకేలకు ఆయన మళ్లీ సెట్స్ పైకి వచ్చారు. ఇది మహేష్ బాబు అభిమానులకు సంతోషం కలిగించినా ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల ఒకటి రెండు రిలీజ్ లు మిస్సయ్యామనే బాధ మాత్రం ఉంది. మహేష్ బాబు 'వరుడు' చిత్రం మళ్లీ ఓ సూపర్ డూపర్ హిట్ ఇస్తే కానీ అభిమానుల్లో మళ్లీ నూతనోత్సాహం తొంగిచూడదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. అద్భుతమైన లొకేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లతో గుక్కతిప్పుకోని విధంగా సినిమా ఉండబోతోందని చెబుతున్నారు. ఆసక్తికరంగా తన చిత్రాల రిలీజ్ కు మధ్య ఏర్పడిన గ్యాప్ ను భర్తీ చేసేందుకు మహేష్ తాజాగా మరో చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్టే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లోనే ఈ కొత్త చిత్రం ఉండబోతోంది.
ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు సోదరి మంజుల ఈ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదికూడా భారీ బడ్జెట్ తోనే ఉండబోతోంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి, 'వరుడు'తో పాటు ఏకకాలంలో ఆ సినిమా షూటింగ్ లోనూ పాల్గొనాలని మహేష్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ రెండు సినిమాలు ఒకదాని వెంట మరొకటి విడుదలై ప్రిన్స్ అభిమానుల సంతోషషాన్ని రెట్టింపు చేయనున్నాయి.
Be first to comment on this News / Article!
|