'ఆ ఇంట్లో' ఏం జరిగింది?
'శివ' చిత్రంతో నటుడిగా పరిచయమైన చిన్నా ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెర ప్రేక్షకులకూ ఆయన దగ్గరయ్యారు. తాజాగా ఆయన సినిమా దర్శకుడిగా కూడా మారి 'ఆ ఇంట్లో' అనే ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యు9 ఎంటర్ ట్రైనర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది.
చిత్రం ప్రోగ్రస్ ను చిన్నా తొలిసారిగా వివరిస్తూ, ఒక ఇంటిలో జరిగే సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనీ, ఆ సంఘటనలు ఏమిటనేవి తెరపైన చూస్తేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందనీ అన్నారు. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందే సినిమా షూటింగ్ పూర్తిందనీ, కేవలం 44 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామనీ చెప్పారు. ఈనెలాఖరులో ఆడియో, మేలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్ర నిర్మాతలు తనకు స్నేహితులనీ, రామ్ గోపాల్ వర్మ తరహాలో చిన్నా ఈ సినిమా చేస్తున్నారని తెలిసిందనీ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు పేర్కొన్నారు. చిన్నా సైతం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆశాషైనీ, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, భిక్షు, రామ్ జగన్, సుబ్బరాయశర్మ, జూనియర్ రేలంగి, పద్మాజయంతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్.శ్రీనివాసరెడ్డి, వి.రాజుచౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. కథ-మాటలు, స్క్రీన్ ప్లే సైతం చిన్నా అందిస్తున్నారు. ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం సమకూరుస్తున్నారు.
Be first to comment on this News / Article!
|