'స్నేహగీతం' పాటలు
లార్ స్కో సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'స్నేహగీతం'. 'మధుర' శ్రీధర్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుహాని శ్రీయ, వైజయంతి, సందీప్, వెంకీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సునీల్ కాస్యప్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది. వి.వి.వినాయక్, రమణగోగుల, ఛోటా కె.నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించి తొలి ప్రతిని ఛోటా కె.నాయుడుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను రమణ గోగుల ఆవిష్కరించి నటీనటులకు అందజేశారు.
వినాయక్ మాట్లాడుతూ, సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత లగడపాటి శ్రీధర్ అనీ, మధుర శ్రీధర్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాననీ చెప్పారు. లగడపాడి శ్రీధర్ మంచి అభిరుచి గల నిర్మాతనీ, తన మేనల్లుడు సందీప్ ఈ చిత్రంలో నటిస్తున్నాడనీ, యూత్ ఫుల్ టీమ్ తో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ పేర్కొన్నారు. ఒక మంచి బ్యానర్ ద్వారా పరిచయం కావడం ఇందులోని నటీనటుల అదృష్టమనీ, కాస్యప్ చక్కటి సంగీతాన్ని అందించారనీ రమణ గోగుల పేర్కొన్నారు. లగడిపాటి శ్రీధర్ మాట్లాడుతూ, దర్శకుడు శ్రీధర్ రెడ్డి సినిమాల మీద తృష్ణతో మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారనీ, కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో తాను ఈ సినిమా తీశాననీ చెప్పారు. ఆరుగురు కొత్త యువతీయువకులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కాస్యప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆడియో రిలీజ్ తో తన కల సగం నెరవేరిందనీ, సినిమా రిలీజ్ తర్వాత తన డ్రీమ్ పూర్తిగా నెరవేరుతుందనీ అన్నారు. దర్శకుడిగా తనకు ఇదే తొలి సినిమా అనీ, తన శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉంచి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన లగడపాటికి తన కృతజ్ఞతలనీ పేర్కొన్నారు. ఇందులోని నటీనటులంతా కొత్తవారే కాకుండా మంచి ఎనర్జీతో నటించారని చెప్పారు. తక్కువ బడ్జెట్ తో కేవలం 50 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేశామని అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది.
Be first to comment on this News / Article!
|