రవితేజ 'కిక్' ఆడియో
రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'కిక్'. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తాజ్ డక్కన్ హోటల్ లో ఆదివారంనాడు జరిగింది. డాక్టర్ డి.రామానాయుడు, వి.వి.వినాయక్, ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మెహర్ రమేష్, తమన్, సురేందర్ రెడ్డి, రసూల్, నితిన్, సాయికుమార్, ఆలీ, శ్యామ్, కోట, వక్కంతం వంశీ, విజయ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆడియో సీడీని రామానాయుడు ఆవిష్కరించి తొలి ప్రతిని వినాయక్ కు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించి మెహర్ రమేష్ కు అందజేశారు. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
తొలుత పలు రిహాబిలేషన్ సెంటర్స్ కు అతిథుల చేతుల మీదుగా నిర్మాత ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం 'కిక్ ద మూవీ డాట్ కామ్' నితిన్ ఆవిష్కరించారు. రామానాయుడు మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత సినిమా విడుదలకు ముందు ఆడియో రిలీజ్ సమయంలో పలు సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం ముదావహమని అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. వినాయక్ మాట్లాడుతూ, బావ రవితేజ, మిత్రుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్.ఆర్.బ్యానర్ నుంచి ఇంతవరకూ వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ప్రేక్షకులను మరింత అలరిస్తుందని అచ్చిరెడ్డి పేర్కొన్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిర్మాత తన ప్రతి సినిమాకి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తుండటం గొప్ప విషయమనీ, రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. నటుడు శ్యామ్ మాట్లాడుతూ, ఇంతవరకూ తాను 15 సినిమాల్లో నటించినా తెలుగులో తొలి సినిమా అని అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, రాజ్ కోటి, కీరవాణి, మణిశర్మ వద్ద కొన్ని సంవత్సరాలు పనిచేశాననీ, తన మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా నిర్మాతలు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందనీ అన్నారు. తమన్ మంచి సంగీతం అందించి తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. యూనిట్ అంతా కష్టపడి పనిచేశామనీ, మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. రవితేజ మాట్లాడుతూ, ఇదొక ఫెంటాస్టిక్ ఎంటర్ టైనర్ అనీ, తమన్ చాలా మంచి సంగీతం ఇచ్చారనీ, అతనికి మంచి భవిష్యత్ ఉందనీ అన్నారు. రసూల్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
Be first to comment on this News / Article!
|