భక్తిరసాత్మకం 'వెంగమాంబ'
బాలనటి నుంచి 'సీతారామయ్య గారి మనుమరాలు' చిత్రంతో హీరోయిన్ గా ఎదిగిన మీనా ఆ తర్వాత తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించారు. ఇటీవల కాలంలో మీనా అడపాదడపా మాత్రమే తెలుగులో కనిపిస్తోంది. ఆమధ్య 'కథానాయకుడు' చిత్రంలో జగపతిబాబు సరసన నటించిన మీనా ఇప్పుడు టైటిల్ పాత్ర పోషిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం 'వెంగమాంబ'. తన కీర్తనలతో ఏడుకొండలవాడి కరుణకు పాత్రులైన వెంగమాంబ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 'అన్నమయ్య' వంటి సక్సెస్ ఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను భక్తిరసంలో ఓలలాడించిన వి.దొరస్వామి రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్నట్టు దొరస్వామిరాజు తెలిపారు.
వెంగమాంబ తన కీర్తనలతో కోనేటి రాయిని కరుణకు పాత్రురాలైన అసమాన భక్తురాలనీ, ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమనీ ఆయన తెలిపారు. 'అన్నమయ్య' తర్వాత తమ సంస్థ నిర్మిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రమిదని వివరించారు. గత మార్చి 31న ఈ చిత్రాన్ని ప్రారంభించామనీ, ఈనెల 15న మరో షెడ్యూల్ మొదలైందనీ చెప్పారు. నెలాఖరు వరకూ షెడ్యూల్ ఉంటుందనీ, మే నెలలో జరిపే మూడో షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. 'అన్నమయ్య' చిత్రానికి సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి ఎంతో చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. జూన్ 7న ఆడియో విడుదల చేసి, జూలైలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శరత్ బాబు, రంగనాథ్, ఎల్.బి.శ్రీరాం తదితరులు నటిస్తున్నారు. అన్నమయ్య, వెంగమాంబ కీర్తనలతో పాటు వేటూరి, వేదవ్యాస్ సాహిత్యం అందించగా, పి.ఆర్.కె.రాజు సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|