బాలయ్యకు త్రిముఖ పోటీ
'మహాకూటమి' తరఫున తెలుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రచార బరిలో విస్తృతంగా పాల్గొంటున్న యువరత్న బాలకృష్ణ ఇప్పుడు వెండితెరపై త్రిముఖ పోటీని ఎదుర్కోబోతున్నారు. కొద్దికాలంగా సరైన హిట్లు లేని బాలకృష్ణకు 'పాండురంగడు' చిత్రం ఓ మోస్తరు ఊరట కలిగించినా సంచలన హిట్ మాత్రం దొరకలేదు. ఆ కొరతను 'మిత్రుడు' చిత్రం తీరుస్తుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మే1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆసక్తికరంగా ఇదే రోజు తమిళ స్టార్ హీరో సూర్య 'వీడొక్కడే' చిత్రంతోనూ, ప్రైమ్ స్టార్ జగపతిబాబు 'బంగారుబాబు' చిత్రంతోనూ బాలకృష్ణను ఢీకొంటున్నారు.
బాలకృష్ణతో గతంలో పలు హిట్లు అందించిన శివలెంక కృష్ణప్రసాద్ వైష్ణవీ సినిమా పతాకంపై 'మిత్రుడు' చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలకృష్ణ సరసన గ్లామర్ తార ప్రియమణి కథానాయికగా నటించింది. ఇక సూర్య నటించిన 'వీడొక్కడే' చిత్రం ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై రూపొందింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనెలలోనే ఈ చిత్రం తమిళంలో 'అయన్' పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో తెలుగు వెర్షన్ పై కూడా గట్టి అంచనాలు ఉన్నాయి. సూర్యకు జోడిగా సంచలన యువనటి తమన్నా హీరోయిన్ గా నటించింది. కాగా, జగపతిబాబు కొద్ది గ్యాప్ తర్వాత నటించిన సకుటుంబ కథాచిత్రంగా 'బంగారుబాబు' తెరకెక్కింది. దాసరి కథ-స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు నటించారు. జగపతిబాబుకు జోడిగా మీరాజాస్మిన్ నటించింది. మే1న ప్రధానంగా ఈ మూడు చిత్రాల మధ్యే పోటీ ఉండబోతోంది. ఇదే రోజు చైనా ఫిల్మ్ 'ఇన్విజబుల్ వింగ్స్'కు అనువాదంగా 'నింగి నేల నాదే' చిత్రం కూడా విడుదలవుతుండటం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తన సొంత సంస్థ ద్వారా విడుదల చేస్తుండటం కూడా కొద్దిపాటి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Be first to comment on this News / Article!
|