మంచు వారి హీరోయిన్
విలక్షణ నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 500కు పైగా చిత్రాల్లో ఆయన నటించగా వాటిలో 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై దాదాపు 50 చిత్రాలు నిర్మించిన క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. తనయులు విష్ణువర్దన్, మనోజ్ కుమార్ లు హీరోలుగా రాణిస్తుండగా, కుమార్తె మంచు లక్ష్మి తన తండ్రితో కలిసి నిర్మాణరంగంలో పాలుపంచుకుంటూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకరకంగా ఇప్పుడు మంచువారి ఫ్యామిలీలో అంతా యువరక్తం ప్రవహిస్తోంది. ఇందులో భాగంగానే మంచు లక్ష్మి త్వరలో హీరోయిన్ గా కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.
తండ్రి పలుకుబడితో ప్రమేయం లేకుండా యుఎస్ఎలో ఉండగానే మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నెట్ వర్క్ టెలివిజన్ లో నటించడంతో పాటు సినిమాలు, టెలివిజన్ షోలలోనూ ఆమె నటించారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం ఆమె జీ తెలుగు ఛానెల్ కోసం 'లక్ష్మీ టాక్ షో' చేస్తున్నారు. దీనికి తోడు వెండితెర ప్రవేశానికి కూడా రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్టు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆమె సోదరుడు విష్ణు నిర్మించబోతున్నారు. ఒకవైపు హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేస్తూ మరోవైపు నిర్మాతగా తన మరో సోదరుడు మనోజ్ తో ఒక సినిమా నిర్మించడానికి లక్ష్మి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్ తోనే 'నేను మీకు తెలుసా' చిత్రాన్ని ఆమె నిర్మించారు. మళ్లీ మనోజ్ తో నే నిర్మించనున్న చిత్రానికి కె.రాఘువేంద్రరావు దర్శకత్వం వహించనున్నారు. వరుసగా భక్తిరస చిత్రాలకే పరిమితమవుతున్న దర్శకేంద్రుడు రాఘువేంద్రరావు మళ్లీ ఓ పక్కా కమర్షియల్ చిత్రంతో సినిమా తీయడమంటే సంచలనాలకు కూడా కొదవుండకపోవచ్చు. నిర్మాతగానే గాకుండా హీరోయిన్ గా కూడా మంచు లక్ష్మి సక్సెస్ కావాలని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|