ఈ వారంలో 4 రిలీజ్ లు
రెండో విడత ఎన్నికలు ఈనెల 23న ముగియనుండటంతో పలువురు నిర్మాతలు తమ కొత్త చిత్రాల రిలీజ్ కు సన్నద్ధమవుతున్నారు. 24వ తేదీ శుక్రవారంనాడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల తీర్పుకోరేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు స్ట్రయిట్ చిత్రాలు కాగా, మరో రెండు అనువాద చిత్రాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జగపతిబాబు కథానాయకుడిగా నటించిన 'అధినేత' చిత్రంపై తగినన్ని అంచనాలు ఉంచాయి.
జగపతిబాబు తొలిసారిగా పొలిటికల్ నేపథ్యంలో నటించిన చిత్రం 'అధినేత'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.సముద్ర దర్శకత్వం వహించారు. తొలి విడత ఎన్నికలకు ముందే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కారణాంతరాల వల్ల ఎన్నికల అనంతరమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ పరిణామం సినిమాకి ఏరకంగా కలిసి వస్తుందనేది చూడాలి. బాలల చిత్రాల కొరతను తీరుస్తూ 'సర్కస్ సర్కస్' చిత్రం ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉమేష్ కుమార్ దర్శకత్వంలో సగిటేరియన్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. బాలనటులు శ్రీధర్, చాందిని, అజయ్, ఉషశ్రీ, మానిష్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. వీటితో పాటు అనువాద చిత్రాలైన 'పండుగాడు', 'కళాశాల' చిత్రాలు సైతం విడుదలవుతున్నాయి. కన్నడ అనువాదమైన 'పండుగాడు' చిత్రంలో హన్సిక, తమిళ అనువాదమైన 'కళాశాల' చిత్రంలో తమన్నా హీరోయిన్లు కావడం విశేషం.
Be first to comment on this News / Article!
|