'కిక్' మే 9 సెంటిమెంట్
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ఏదీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. తొలిచిత్రం 'అతనొక్కడే' సంచలన హిట్ సాధించినప్పటికీ మలి చిత్రం 'అశోక్', 'అతిథి' చిత్రాలు ఆశించిన విజయాలను అందివ్వలేకపోయాయి. 'అతిథి' చిత్రం తర్వాత సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ఇప్పుడు 'కిక్' చిత్రంతో సురేందర్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రవితేజ, ఇలియానా రెండోసారి ('ఖతర్నాక్' తర్వాత) కలిసి నటిస్తుండటం, 'జల్సా' వంటి హిట్ తర్వాత ఇలియానా నటించిన చిత్రం ఇదే కావడంతో సహజంగానే ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి కూడా మంచి స్పందన లభిస్తుండటంతో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సురేందర్ రెడ్డి తొలిచిత్రమైన 'అతనొక్కడే' చిత్రం 2005 మే 9న విడుదలైంది. ఆ చిత్రం మంచి సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అదే తేదీన సినిమాను విడుదల చేయడం కలిసొచ్చే అంశంగా సురేందర్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇన్ స్పెక్టర్ గా ఓ కీలక పాత్రను తమిళ హీరో శ్యామ్ పోషిస్తున్నారు. రవితేజ తర్వాత ఈ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆషిక, బ్రహ్మానందం, కోట, వేణుమాధవ్, ఆలీ, సాయాజీ షిండే, నళిని, ప్రభ తదితరులు నటించారు. సురేందర్ రెడ్డి కథ, అబ్బూరి రవి-వక్కంతం వంశీ మాటలు, సీతారామశాస్త్రి పాటలు, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, విజయ్ స్టంట్స్, ఎస్.థామస్ ('మళ్లీ మళ్లీ', 'బీభత్సం' ఫేమ్) సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|