సెంచరీ కొట్టిన 'అరుంధతి'
గ్లామర్ నటి అనుష్క కెరర్ లోనే తొలిసారిగా అరుంధతిగా, జేజమ్మగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకుల జేజేలు అందుకున్న'అరుంధతి' చిత్రం ఈ శనివారంతో విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల తేదీని ప్రకటించినప్పటికీ కారణాంతరాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అప్పట్నించి అప్రతిహతంగా నడక సాగించి ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ హిట్ గా పలు రికార్డులను సొంతం చేసుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో శ్యాంప్రసాద్ రెడ్డి ఇటీవల సొంతంగానే తమిళంలోకి అనువదించిన విడుదల చేశారు. అక్కడ కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు హిందీలో ఈ చిత్రాన్ని సొతంగా రీమేక్ చేసేందుకు శ్యాంప్రసాద్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు.
'అమ్మోరు' తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి, కోడిరామకృష్ణ కాంబినేషన్ లో ప్రేక్షకులు పట్టం కట్టిన చిత్రంగా 'అరుంధతి'ని చెప్పవచ్చు. రెండేళ్ల పాటు శ్రమించి 13 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని శ్యాంప్రసాద్ నిర్మించారు. విడుదలకు చివరి నిమిషంలో ఆర్థిక సమస్యలు తలెత్తినా సినిమాపై నమ్మకంతో ఆయన సొంతగా రిలీజ్ చేసి నిర్మాతగా తనకున్న కమిట్ మెంట్ ను చాటుకున్నారు. ఈ చిత్రం తర్వాత అనుష్క టాలీవుడ్ టాప్ చైర్ కు మరింత దగ్గరైంది. కోడి రామకృష్ణ మళ్లీ రెండు మూడు చిత్రాలు కమిట్ అయ్యారు. శ్యాంప్రసాద్ రెడ్డి హిందీవైపు (రీమేక్ కోసం) వెళ్తున్నారు. 'అరుంధతి' శతదినోత్సవ వేళ మరిన్ని భాషల్లో విడుదలై దుమ్ము దులుపుతుందనీ, తెలుగు సినిమా స్టామినా ప్రపంచ దేశాలకు సైతం చాటుతుందనీ ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|