జెనీలియా 'కథ' షురూ
'ఐతే'. 'అనుకోకుండా ఒకరోజు', 'అమ్మ చెప్పింది' వంటి విలక్షణ చిత్రాలను అందించిన జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై నిర్మాత గుణ్ణం గంగరాజు 'కథ' అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. జెనీలియా, అరుణ్ (తొలి పరిచయం) జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస్ రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని ఎస్ఓసి చిల్ట్రన్స్ విలేజ్ గా ఆదివారంనాడు ప్రారంభమైంది.
గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ, 'అమ్మచెప్పింది' చిత్రం తర్వాత మ్యూడేళ్లకు ఈ సినిమా తీస్తున్నామనీ, శ్రీనివాస్ చెప్పిన కథ తమకెంతో నచ్చిందనీ చెప్పారు. జెనీలియాకు ఇది కొత్త తరహా చిత్రమవుతుందన్నారు. ఇదొక మంచి ప్రేమ కథ అనీ, థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. జస్ట్ ఎల్లో వంటి మంచి బ్యానర్ లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో తాను 'నవ్వుతూ బతకాలిరా', 'త్రినేత్రుడు', 'జెండా' వంటి చిత్రాలకు కోడి రామకృష్ణ వద్ద పనిచేశాననీ, తన సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా అడక్కుండా ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చిన గుణ్ణం గంగరాజుకు తన కృతజ్ఞతలనీ అన్నారు. కొత్త జనర్ సినిమా ఇదనీ, స్క్రిప్టు చాలా బాగుందనీ జెనీలియా పేర్కొన్నారు. ఇందులో తాను టీచర్ పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. అరుణ్ మాట్లాడుతూ, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో తాను జర్నలిజం గ్యాడ్యుయెట్ ననీ, ప్రకాష్ రాజ్ తమిళంలో నటిస్తున్న 'హ్యాపీడేస్' చిత్రంలో తాను హీరోగా నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఒక కథా రచయితగా తన పాత్ర ఉంటుందన్నారు. గుణ్ణం గంగారాజు తీసిన నాలుగు టీవీ సీరియల్స్ కు తాను పనిచేసినట్టు సంగీత దర్శకుడు ఎస్.కె.బాలచంద్రన్ తెలిపారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయనీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేస్తారు. ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫీ వంటి పలువురు ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు సంభాషణలు, ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|