'కిక్' సక్సెస్ ఇస్తుందా?
సమ్మర్ సీజన్ లో 'బిల్లా' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ద సినిమాల్లో 'కిక్' ఒకటి. రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని ఖర్చుకు రాజీపడకుండా నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాంబినేషన్ల పరంగా చూసినా, సక్సెస్ ట్రాక్ పరంగా చూసినా ఈ టీమ్ లోని అందరికీ ఇప్పుడు సక్సెస్ అనేది అనివార్యమవుతోంది.
రవితేజ గత రెండు సినిమాల నుంచి సక్సెస్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. 'బలాదూర్', 'నేనింతే' చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని
చవిచూశాయి. ఇలియానాకు యూత్ లో ఉన్న క్రేజ్ ఇప్పటికీ యథాతథంగానే ఉంది. అయితే గత ఏడాది 'జల్సా' చిత్రం సక్సెస్ తర్వాత మళ్లీ ఇలియానా కనిపించలేదు. ఈ గ్యాప్ లో అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు తమ డిమాండ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. దీంతో ఇలియానుకు సైతం ఓ హిట్ అనివార్యమవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి ప్రాజెక్ట్ లే ఉన్నప్పటికీ తన పొజిషన్ స్థిరపరచుకోవాలంటే ఆమెకు సైతం సక్సెస్ కిక్ అవసరం. నిజానికి రవితేజ-ఇలియానా కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన 'ఖతర్నాక్' చిత్రం అపప్రదను మూటగట్టుకుని బాక్సాఫీస్ వద్ద మట్టి కరిచింది. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ పెయిర్ ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదనే చెప్పాలి. 'అతనొక్కడే'తో దర్శకుడిగా తొలి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డికి ఆ తర్వాత తీసిన 'అశోక్', 'అతిథి' చిత్రాల ఫలితాలు అంతగా కలిసిరాలేదు. దీంతో ఆయన సైతం గట్టి పట్టుదలతో 'కిక్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచిపేరు రావడంతో సినిమా కూడా తమకు మంచి సక్సెస్ 'కిక్' ఇస్తుందని యూనిట్ ఆశాభావంతో ఉంది. అది తేలాలంటే మే 8వ తేదీ వరకూ ఆగాల్సిందే. అదే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Be first to comment on this News / Article!
|