'నేరము-శిక్ష' ఆడియో
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నేరము-శిక్ష'. అకుల్, ఆకర్షణ హీరోహీరోయిన్లు. విజయకృష్ణా మూవీస్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీమతి విజయనిర్మల ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి ప్రతిని కృష్ణకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
దాసరి మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'తాతమనవడు' లో విజయనిర్మల కథానాయికగా నటించారనీ, ఆరోజుల్లో పెద్ద హీరోల పక్కన నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ రాజబాబు సరసన కూడా కథానాయికగా నటించడం గొప్ప విషయమనీ అన్నారు. దీనినిబట్టి సినిమాలోని పాత్రకు ఆమె ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. నటిగా, దర్శకురాలిగా ఎంతో అంకితభావం ఆమెకుందని ప్రశంసించారు. ఎక్కడా వేస్టేజ్ లేకుండా సినిమా ఈ నిర్మాణం సాగించారనీ, ఇప్పటి దర్శకులు 13000 అడుగుల సినిమా కోసం రెండు లక్షల అడుగులకు పైగా నెగిటివ్ ఎక్స్ పోజ్ చేసి తామే గొప్ప దర్శకులమని అనుకుంటున్నారని విమర్శించారు. కృష్ణ అప్పట్లో రోజుకు మూడు షిఫ్టులు చేసి సంవత్సరానికి 20కి పైగా సినిమాల్లో నటించిన ఘనతను దక్కించుకున్నారని అన్నారు. కృష్ణ నిర్మాతల పాలిటి కల్పవృక్షమని, అలాగే ఆయన, విజయనిర్మల కాంబినేషన్ లో 'దేవదాసు' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయన్నారు. మళ్లీ ఇదే కాంబినేషన్ లో విజయనిర్మల దర్శకత్వంలో వస్తున్న ఈ నవలా చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చాలా చక్కగా తన పాత్రను విజయనిర్మిల మలిచారని కృష్ణ తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు కృష్ణ తనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారనీ, పాత, కొత్త తారలతో సినిమా రూపొందించామని చెప్పారు. కోటి మంచి సంగీతం ఇచ్చారని తెలిపారు. నరేష్, సీనియర్ నటుడు బాలయ్య, ఏవీయస్, అకుల్, నిశ్చల్, ధీరజ్, నటి గీతాంజలి, రచయిత వెనిగెళ్ల రాంబాబు, ఛాయాగ్రాహకుడు వి.శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, అభిమానులు ఖాదర్ ఘోరి, పల్లె జంగయ్య గౌడ్ లు విడివిడిగా 116 సీడీలను కొనుగోలు చేశారు.
Be first to comment on this News / Article!
|