దర్శకేంద్రుడితో కలెక్షన్ కింగ్
కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి పరిశ్రమలోని అగ్రహీరోలందరితోనూ గతంలో పలు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు కొద్దికాలంగా 'శ్రీ మంజునాథ' 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'పాండురంగడు' వంటి భక్తిరస ప్రధాన చిత్రాలకే పరిమితమవుతూ వస్తున్నారు. ఇక ఆయన నుంచి మళ్లీ పక్కా కమర్షియల్ చిత్రం వచ్చే అవకాశాలు దాదాపు లేవని అంతా ఆశలు వదిలేసుకున్న తరుణంలో అనూహ్యంగా ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇది రాఘువేందర్రావు ఒకప్పటి ట్రేడ్ మార్క్ కమర్షియల్ మూవీగా ఉండబోతోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కుమార్, మోహన్ బాబు కలిసి నటించబోతుండటం విశేషం.
మెహన్ బాబు, కె.రాఘువేంద్రరావు కాంబినేషన్ కు ప్రత్యేకత ఉంది. రాఘువేంద్రరావు తీసిన ఎన్నో చిత్రాల్లో మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటించారు. అలాగే మోహన్ బాబు కథానాయకుడుగా నటించిన 'అల్లుడు గారు', 'మేజర్ చంద్రకాంత్' చిత్రాలు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించాయి. లక్ష్మీప్రసన్న బ్యానర్ లో అతిపెద్ద హిట్ గా 'మేజర్ చంద్రకాంత్' నిలిచింది. ఆ చిత్రంలో చిన్నప్పటి మోహన్ బాబుగా మనోజ్ కుమార్ నటించడం విశేషం. అయితే మనోజ్ హీరో అయిన తర్వాత ఆయన నటించిన ఏ చిత్రంలోనూ మోహన్ బాబు నటించలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను కె.రాఘువేంద్రరావు తీసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వలో మనోజ్ నటిస్తున్న 'ప్రయాణం', శర్వానంద్ తో కలిసి మోహన్ బాబు టైటిల్ పాత్రలోనటిస్తున్న'రాజు-మహారాజు' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|