సూర్య క్వార్టర్ సెంచరీ
'కష్టే ఫలి' అనడానకి తమిళ స్టార్ హీరో సూర్యను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 'గజనీ' తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని ఇటీవల నటించిన ద్విభాషా చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' కేవలం ప్రశంసలకే పరిమితమై బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసింది. అయితే ఈసారి ఆయన అంచనాలు తప్పలేదు. ఆయన తాజా చిత్రం 'అయన్' తమిళనాట విజయఢంకా మోగిస్తోంది. గత ఐదేళ్ల తమిళ సినిమా రికార్డులను కూడా ఈ చిత్రం తిరగరాస్తోందంటూ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. సూర్య-తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం విజయవంతంగా క్వార్డర్ సెంచరీ (25 రోజులు) పూర్తి చేసుకుంది. 'గజనీ' చిత్రం తర్వాత సూర్యకు దక్కిన అతి పెద్ద సక్సెస్ ఇదేననీ, ఈ చిత్రంతో ఇప్పుడున్న హీరోల్లో ఆయన పొజిషన్ మరింత స్ట్రాంగ్ అయిందనీ కోలీవుడ్ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. ఆసక్తికరంగా ఈ చిత్రం మే 1న తెలుగులో 'వీడొక్కడే' పేరుతో ప్రేక్షకుల తీర్పు కోరనుంది.
తొలుత తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగా తమిళనాట విడుదల చేశారు. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్ ను సురేష్ డిస్ట్రిబ్యూషన్ తో కలిసి నిర్మాతలు సొంతంగా విడుదల చేస్తున్నారు. 'అయన్' చిత్రం క్వార్టర్ సెంచరీ పూర్తి చేసుకోవడమే గాకుండా ఇప్పుడు కెరీర్ పరంగా కూడా క్వార్టర్ మైలురాయికి సూర్య చేరువవుతున్నారు. 'అయన్' ఆయన 23వ చిత్రం కాగా, 24వ చిత్రంగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'ఆదవన్', 25వ చిత్రంగా హరి దర్శకత్వంలో 'సింగం' చిత్రాలు ప్రస్తుతం ప్రోగ్రస్ లో ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|