'అనంతపురం' ఆడియో
కలర్స్ స్వాతి కథానాయికగా తమిళంలో విజయవంతమైన 'సుబ్రమణ్యపురం' చిత్రం ఇప్పుడు తెలుగులో 'అనంతపురం 1980' పేరుతో అనువాదమైంది. సింహపురి టాకీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అదించనుంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం రాత్రి ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి మాదాల రవికి అందించారు. ఆడియో సీడీని నటి కాజల్ ఆవిష్కరించి భీమినేని శ్రీనివాసరావుకు అందజేశారు.
తమిళంలో ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించిందనీ, తెలుగమమాయి కలర్స్ స్వాతి ఇప్పటికే రెండు సినిమాల ద్వారా తానేంటో నిరూపించుకుందని పోకూరి బాబూరావు పేర్కొన్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించాలని అభిలషించారు. 1980ల నాటి వాతావరణాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని భీమినేని శ్రీనివాసరావు తెలిపారు. మరో దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ, ఇలాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, ఈ చిత్ర దర్శకుడు శశికుమార్ కు అలాంటి ధైర్యం ఉందనీ, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమా రూపొందించారనీ చెప్పారు. ఈ చిత్రం తనకెంతో నచ్చి సీడెడ్ ఏరియాను తాను తీసుకున్నట్టు పరాస్ జైన్ తెలిపారు. స్వాతి మాట్లాడుతూ, తమిళంలో హిట్టయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారనే వెలితి తనకు ఉండేదనీ, ఇప్పుడు ఈ చిత్రం అనువాదం కావడంతో ఆ కొరత తీరిందనీ చెప్పారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పినట్టు తెలిపారు. తెలుగులో ఈ చిత్రం స్వాతికి మరింత మంచిపేరు తెచ్చిపెడుతుందని హీరో జే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శశాంక్ వెన్నెలకంటి, లక్ష్మీనారాయణ, నిర్మాతలు రఘునాథ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|