35 ప్రింట్లతో 'బంగారుబాబు'
జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా దాసరి పద్మ సమర్పణలో సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణప్రసాద్ నిర్మించిన 'బంగారుబాబు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. మే1న 35 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఆయన మంగళవారంనాడు ఆ విశేషాలను తెలియజేశారు.
సెంటిమెంట్ తో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా 'బంగారుబాబు' తెరకెక్కిందనీ, డాక్టర్ దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయనీ చెప్పారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు ప్రతి ఫ్రేమును ఎంతో బాగా తీర్చిదిద్దారని తెలిపారు. నటుడు మాగుంట సుధాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా కాశ్మీర్ వెళ్లినప్పుడు ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ దాసరి సహకారంతో వాటిని అధిగమించి పాటలు చిత్రీకరించి రావడం జరిగిందన్నారు. దాసరి చిత్రాలలో సహజంగా సందేశం మిళితమై ఉంటుందనీ, ఇందులోనూ మనిషికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదనీ, అంతా కలిసి మెలిసి ఉండాలనే సందేశం ఉందన్నారు. సిరి మీడియా ద్వారా ఈ చిత్రాన్ని సొంతంగానే విడుదల చేస్తున్నట్టు చెప్పారు. చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ లో అంత మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతిబాబు అనీ, అందరినీ మెప్పించే చక్కటి నటనను జగపతిబాబు ఈ చిత్రంలో ప్రదర్శించారనీ చెప్పారు. శ్రీలేఖ సంగీతం అలరింపజేస్తుందనీ, ఇంత మంచి బ్యానర్ లో పనిచేసే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|