సునీల్ కూడా తగ్గాడు
కమెడియన్ సునీల్ ఇప్పుడు బాగా తగ్గాడు. ఇదేదో సినిమాల సంఖ్య అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. తగ్గిందల్లా ఒంటి బరువే. అది కూడా రాజమౌళి ఇచ్చిన సూచనల మేరకు కొన్ని కిలోల బరువు తగ్గించుకుని కొద్దిపాటి స్లిమ్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఆ మధ్యన 'యమదొంగ' చిత్రం కోసం ఎన్టీఆర్ ను బరువు తగ్గించుకోమని చెప్పడం, వెంటనే ఆయన సన్నబడి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తడం మనకు తెలుసు. ఎన్టీఆర్ బాటలోనే సునీల్ ను కూడా బరువు తగ్గించుకోమని చెప్పడంతో ఆయన కష్టపడి ఓ 15 కిలోల వరకూ తగ్గారు. ఇదంతా సునీల్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం కోసం చేస్తున్న కసరత్తులో భాగమే.
కొద్దికాలం క్రితం సునీల్ 'అందాలరాముడు' చిత్రంతో హీరోగా కూడా మారారు. ఆ చిత్రం మంచి విజయం సాధించినా సునీల్ మళ్లీ హీరో వేషాల వైపు తొంగిచూడలేదు. కమెడియన్ గానే బిజీగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు రాజమౌళి నుంచి సునీల్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ చిత్రానికి సునీల్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి 'మగధీర' సినిమా పూర్తి కాగానే సునీల్ హీరోగా నటించే సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. అలాగే రవితేజ హీరోగా వచ్చే ఏడాది ఒక చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
Be first to comment on this News / Article!
|