'నారా రోహిత్'కు ముహూర్తం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ హీరోగా పరిచయమవుతున్నారు. చంద్రబాబు తమ్ముడైన నారా రామ్మూర్తి తనయుడే రోహిత్. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా చైతన్య దంతులూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
నటరత్న ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ తేజ వరకూ అన్ని తరాల హీరోలతోనూ సినిమాలు తీసిన క్రెడిట్ అశ్వనీదత్ కు దక్కుతుంది. మహేష్ తొలిచిత్రం 'రాజకుమారుడు', రామ్ చరణ్ 'చిరుత' తో పాటు ఎన్టీఆర్ కు సరైన బ్రేక్ ఇచ్చిన 'స్టూడెంట్ నెంబర్ 1', అల్లు అర్జున్ పరిచయమైన 'గంగోత్రి', కల్యాణ్ రామ్ కు గుర్తింపు తెచ్చిన 'అభిమన్యు', తారకరత్న ఇంట్రడ్యూస్ అయిన 'ఒకటో నెంబర్ కుర్రాడు', రజనీకాంత్ 'కథానాయకుడు' చిత్రాలను అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ను హీరోను పరిచయం చేస్తున్న క్రెడిట్ కూడా ఆయన దక్కించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించేందుకు అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మే 4న ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ, వైజాగ్, విజయనంగరం, బొబ్బిలి, కర్ణాటకలోని కొన్ని ముఖ్య ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, గంధం నాగరాజు మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|