గుత్తా రామినీడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు గుత్తా రామినీడు (82) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రులో ఆయన జన్మించారు. తొలుత ఆయన 'చరణదాసి' (1956) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడుగా నటించిన 'కలిమిలేములు' (1958) చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో తెలుగు పరిశ్రమ చెన్నైలోనే ఉన్నప్పటికీ పూర్తిగా హైద్రాబాద్ లోనే సినిమా తీసిన తొలి దర్శకుడిగా గుత్తా రామినీడు పేరుతెచ్చుకున్నారు. అలా ఆయన తీసిన 'మా ఇంటి మహాలక్ష్మి' చిత్రం (1959) ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతోంది. దర్శకుడుగా 20కు పైగా చిత్రాలు తీసిన ఆయన పలు చిత్రాలను నిర్మించారు కూడా. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాల్లో 'చివరకు మిగిలేది' (1960), 'అనురాగం' (1963), పల్నాటి యుద్ధం (66), భక్త పోతన (66), బంగారు సంకెళ్లు (68), తల్లీకూతుళ్లు (71), మూగప్రేమ (71), చైర్మన్ చలమయ్య (74), ప్రతీకారం (82)., రాజ్ కుమార్ (83) ఉన్నాయి. కమ్యూనిజం భావాలు మెండుగా ఉన్న గుత్తా రామినీడు సామాజిక నిబద్ధత ఉన్న చిత్రాలను రూపొందించడం ద్వారా 60-70 దశకాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బంగారు సంకెళ్లు' చిత్రానికి రచయితగా కూడా పనిచేసిన రామినేడు 'పల్నాటి యుద్ధం'లో నటించారు కూడా. వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన చక్రవర్తిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా రామినీడే కావడం విశేషం. పలువురు సినీ ప్రముఖులు రామినీడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు దర్శకనిర్మాతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు గురువారంనాడు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Be first to comment on this News / Article!
|