మేడే విజేత ఎవరు?
'అరుంధతి' చిత్రం మినహా గత నాలుగు నెలల్లో చెప్పుకోదగిన హిట్ లేకపోవడంతో టాలీవుడ్ కళ తప్పినట్టయింది. రెండు మూడు చిత్రాలు యావరేజ్ అనిపించుకున్నప్పటికీ వరుస ఫ్లాపులతో పరిశ్రమ కుదేలవుతోంది. పరీక్షలు, ఎన్నికలు, క్రికెట్ మ్యాచ్ లు, ఆర్థిక మాంద్యం వంటివి గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ వచ్చాయి. ఈ తరుణంలో మే1న విడుదలవుతున్న 3 భారీ చిత్రాలతో పరిశ్రమకు మళ్లీ కొత్త ఊపిరి వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన 'మిత్రుడు', తమిళ హీరో సూర్య నటించిన 'వీడొక్కడే', జగపతిబాబు హీరోగా 'బంగారుబాబు' ఇదే రోజు పోటీ పడుతున్నాయి.
'పాండురంగడు' చిత్రంతో కొద్దిపాటి ఊరట లభించిన బాలకృష్ణ ఈసారి 'మిత్రుడు'గా విజయకేతనం ఎగురవేయడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. గతంలో ఆయనతో పలు హిట్లు అందించిన నిర్మాత శివలెంక ప్రసాద్ ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలకృష్ణకు జోడిగా గ్లామర్ క్వీన్ ప్రియమణి నటించడం, మణిశర్మ సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. తమిళ హీరో సూర్య ఇప్పటికే 'వీడొక్కడే' చిత్రానికి తమిళ మాతృక అయిన 'అయన్ 'తో సూపర్ డూపర్ హిట్ సాధించారు. తమిళంలో ముందుగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో 'వీడొక్కడే' గా వస్తుండటంతో సహజంగా ఇక్కడా కూడా హిట్ ఖాయమనే గట్టి అంచనాలున్నాయి. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై నిర్మించిన 174వ చిత్రమిది. ప్రముఖ కెమెరామన్ కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న తమన్నా ఇందులో సూర్యకు జోడిగా నటించింది. ఇక గతవారం 'అధినేత'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగపతిబాబు ఇప్పుడు 'బంగారుబాబు' అవతారమెత్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో జగపతిబాబుకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకుడు. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే అందించడం, దాసరి పద్మ సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. జగపతిబాబుకు జోడిగా మీరాజాస్మిన్ నటించింది. ఈ మూడు చిత్రాల మధ్యే ప్రధానమైన పోటీ ఉండగా, మరో రెండు చిత్రాలు కూడా ఇదే రోజు విడుదలవుతున్నాయి. చైనాలో అవార్డులు, రివార్డులు అందుకున్న 'ఇన్ విజిబుల్ వింగ్స్' చిత్రం 'నింగి నేల నాదే' పేరుతో తెలుగులో అనువాదరూపంలో విడుదలవుతోంది. దిల్ రాజు
తన సొంత సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీనికితోడు 'అనంతపురం 1980' అనే మరో అనువాద చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రంలో తెలుగమ్మాయి కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ఈ అన్నిచిత్రాల్లో ప్రేక్షకుడు 'మేడే' పట్టం ఎవరికి కడతాడనేది ఆసక్తికరం.
Be first to comment on this News / Article!
|