'దమ్మున్నోడు' ఆడియో
రిషి, సౌమ్య జంటగా బివివి చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దమ్మున్నోడు'. యుకె ఎవెన్యూస్ కు చెందిన ఉదయ్ కిరణ్ సమర్పణలో లచ్చురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం రాత్రి ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి ప్రతిని హీరో రిషికి అందజేశారు. మరో అతిథి కె.అచ్చిరెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని ఫైనాన్సియర్ కన్నయ్యకు అందించారు. అంతకుముందు ఆకాష్, రిషి, అట్లూరి పుండరీకాక్షయ్య, అచ్చిరెడ్డి, నటుడు సత్యప్రకాష్, దైవజ్ఞశర్మ ఒక్కో పాటను విడుదల చేశారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ప్రతిభావంతులైన టీమ్ కలసి పనిచేసిన చిత్రమిదనీ, మంచి దమ్మున్న సినిమాగా నిరూపించుకుంటుందని ఆశిస్తున్నాననీ అన్నారు. దర్శకుడు చౌదరి తన తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద చాలా ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పనిచేశారనీ, ఈ చిత్రం మంచి విజయం సాధించి యూనిట్ అందరికీ మంచిపేరు తేవాలని అల్లరి నరేష్ అభిలషించారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ను కొత్తగా చెప్పేందుకు దర్శకుడు ఎంతో తపించారని చెప్పారు. రీరికార్డింగ్ కూడా బాగా కుదిరిందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువకుడి కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర కథనీ, ఇందులో పూర్తి స్థాయి యాక్షన్ పాత్రను పోషించాననీ హీరో రిషి తెలిపారు.దర్శకుడు చౌదరి మాట్లాడుతూ, 13 ఏళ్లుగా దర్శకత్వ శాఖలో అనుభవమున్న తనకు దర్శకుడిగా ఇది తొలి చిత్రమని చెప్పారు. రిషికి మాస్ హీరోగా మంచి పేరు వస్తుందనీ,. మేలో సినిమా విడుదలవుతుందనీ అన్నారు. చిత్ర సమర్పకుడు పి.ఉదయ్ కిరమ్, నిర్మాత ఎ.రాజు, నటులు రాంజగన్, విజయ్ సాయి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|