మున్నార్ లో 'కలవరమాయే..'
గాయని కావాలనుకునే ఓ అమ్మాయిని ఒక అమ్మాయి ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ ఇతివృత్తంలో 'కలవరమాయే మదిలో' చిత్రం రూపొందుతోంది. ఆ అమ్మాయిగా కలర్స్ స్వాతి, అబ్బాయిగా కమల్ కామరాజ్ ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్)
నటిస్తున్నారు. 'హోప్' చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఈనెల 12 నుంచి మున్నార్ లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నట్టు సతీష్ తెలిపారు. ఇందులో స్వాతి ఓ ఛాలెంజింగ్ రోల్ పోషిస్తోందనీ, అలాగే విక్రమ్ గోఖలే అనే ప్రముఖ నటుడు, స్టేజ్ ఆర్టిస్టు ఇందులో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారనీ చెప్పారు. పాటలన్నీ వనమాలి చేత రాయించామనీ, శరత్ చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారనీ చెప్పారు. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు. ప్రేమకథతో పాటు ఫ్యామిలీ డ్రామా మిళితమై ఉండే చిత్రమిదని నిర్మాత మోహన్ తెలిపారు. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆవకాయ్ బిర్యానీ చిత్రంలో ఆటోడ్రైవర్ గా నటించిన తనకు ఇందులో ఛాలెంజింగ్ రోల్ దొరికిందని కమల్ కామరాజ్ పేర్కొనగా, చాలా క్యూట్ క్యారెక్టర్ ఇదని స్వాతి తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయసుధ, తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేస్వరి, ఎం.ఆర్.చౌదరి, వేణు, కోమలి సిస్టర్స్ , కె.కార్తీక్ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|