'ఈనాడు' టీమ్ పరిచయం
కమల్ హాసన్ కథానాయకుడుగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ , యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న 'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రాన్ని చెన్నైలో శుక్రవారంనాడు అధికారికంగా ప్రకటించారు. హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో 'ఈనాడు' పేరుతో ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిసిటీకి దూరంగా ప్రారంభమైంది. 'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రం యూనిట్ ను కమల్ తొలిసారిగా వేదిక మీదకు తీసుకువచ్చి పరిచయం చేశారు. కమల్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, చక్రి, శ్రుతి, యుటీవీ రామ్ మిర్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం ద్వారా చక్రి యేలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చక్రి బాలనటుడిగా కమల్ హాసన్ 'సాగర సంగమం'లో నటించాడు. ఇటీవల కమల్ 'దశావతారం'లోనూ సైంటిస్ట్ వేషం వేశారు. యుఎస్ఎలోని ఫ్లోరిడా ఫిల్మ్ స్కూల్ లో ఆయన శిక్షణ పొందారు. ఈ చిత్రం ద్వారా కమల్ కుమార్తె శ్రుతి సంగీత దర్శకురాలిగా కూడా పరిచయమవుతున్నారు. ముంబైకి చెందిన మనోజ్ సోని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం 4కె రిజల్యూషన్స్ ఉండే రెడ్ కెమెరాను వాడుతున్నారు.
కమల్ మాట్లాడుతూ, మోహన్ లాల్ కూ, తనకూ మధ్య వచ్చే కాంబినేషన్ సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశామనీ, ఆయన డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉందనీ అన్నారు. మోహన్ లాల్ తో పనిచేయాలనే కోరిక తనకు ఎప్పట్నించో ఉందనీ, ఇప్పుడు రాజ్ కుమల్ బ్యానర్ పై ఆ కోరిక నెరవేరడం సంతోషంగా ఉందనీ ఆయన తెలిపారు. మే నెలాఖరుకు షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. కమల్ తో కలిసి నటించడం తనకు దగ్గిన అపూర్వ గౌరవమని మోహన్ లాల్ అభివర్ణించారు. ఆయనకు ఉన్న ఫిల్మ్ మేకింగ్ పాషన్ అసామాన్యమని అన్నారు. ఎంతో ఇష్టపడి ఈ చిత్రంలో నటించినట్టు చెప్పారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో మోహన్ లాల్ పాత్రను హీరో వెంకటేష్ పోషిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|