వంశీ నేపథ్యగానం
క్రియేటివ్ డైరెక్టర్ వంశీకీ, గోదావరి తీర ప్రాంతానికీ ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. గోదావరి అందాలను తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఈసారి ఎకాఎకిన తన చిత్రం టైటిల్ లో గోదావరిని చేర్చి 'గోపి గోపిక గోదావరి' అనే పేరుతో ఓ విలక్షణ ప్రేమకథా ఇతివృత్తాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గోపి, గోపికల ప్రేమ విహారానికి గోదావరి వేదిక అయితే ఇక చూసేవారికి కన్నులపండువే కదా. కంటి నిండా ఆనందం...మనసు నిండా అహ్లాదం. ప్రేక్షకులకు అలాంటి వినూత్న అనుభూతినే ఈ చిత్రం కలిగిస్తుందని చిత్ర నిర్మాత వల్లూరి పల్లి రమేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వేణు, కమలిని ముఖర్జీ ప్రధాన జంటగా నటించగా, వంశీ ఈ చిత్రంలో రెండు పాటలు పాడటం విశేషం. చక్రి సంగీతం అందించారు.
వంశీ, చక్రి కాంబినేషన్ లో గతంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' వంటి పలు మ్యూజికల్ హిట్లు వచ్చాయి. గతంలో 'వెన్నెల్లో హాయ్ హాయ్' పాటకు వంశీ హమ్మింగ్ చేశారు కూడా. తాజాగా 'గోపి గోపిక గోదావరి' కోసం రెండు పాటలు కూడా ఆలపించారు. ఈ సాంగ్స్ బాగా వచ్చాయనీ, తెలుగులో సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమనీ చక్రి అభిప్రాయ పడుతున్నారు. ఈనెల 8న రాజమండ్రి గోదావరి తీరంలో ఆడియో సీడీలను విడుదల చేయనున్నారు.
Be first to comment on this News / Article!
|