అందాల నటి త్రిష ఇప్పుడు సింగర్ గా కూడా మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. త్రిష మంచి సింగర్ అనే విషయం ఇప్పటివరకూ ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె తనలో తాను పాడుకోవడం తప్పితే ఎవరికీ తన పాటలు వినిపించకపోవడమే. అయితే ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడాలనే కోరిక మాత్రం ఆమెకు చాలాకాలంగా ఉంది. అలాంటి అవకాశం ఇప్పడు రానే వచ్చింది. ప్రస్తుతం ఆమె గౌతమ్ దర్శకత్వంలో 'వెన్నైత్తాండి వరువాయా' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అందులో శింబు కథానాయకుడు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా గౌతమ్ త్రిషను ఎప్రోచ్ అయినప్పుడు రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడే ఛాన్స్ ఇవ్వాల్సిందింగా కోరిందట. అందుకు గౌతమ్ కూడా సరేననడంతో ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది.
రెహ్మాన్ ఈ సినిమా కోసం ఓ ట్యూన్ కూడా ఇవ్వడంతో త్రిష చేత వాయిస్ టెస్ట్ కూడా చేయించారనీ, ఆమె గొంతు సూటబుల్ గా ఉండటంతో త్వరలోనే రికార్డింగ్ కూడా జరుగనుందనీ చెబుతున్నారు. తన సినిమాల్లో అడపాదడపా పాటలు పాడే శింబు సైతం ఈ పాటలో త్రిషతో గొంతు కలుపుతాడని చెబుతున్నారు. మొత్తానికి గాయని కావాలన్న త్రిష కోరిక తీరితే...ఎలాగూ సినిమా తెలుగులోకి వస్తుంది కాబట్టి త్రిష గొంతును మనమూ వినొచ్చు.