ఘనంగా దాసరి బర్త్ డే
దర్శకరత్న దాసరి నారాయణరావు 63వ బర్త్ డే సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఆత్మీయాతిథుల సమక్షంలో సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సందడిగా జరగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, యువరత్న నందమూరి బాలకృష్ణ వంటి పలువురు సినీ ప్రముఖులు దాసరిని కలుసుకుని బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
దాసరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా తన పుట్టిన రోజును అభిమానులు, పరిశ్రమ ప్రముఖులంతా ఒక పండుగలా చేసుకుంటున్నావనీ, వారందరికీ తాను రుణపడి ఉంటాననీ అన్నారు. తన బర్త్ డే రోజునే 'ఎ లెజెండ్ యాక్ట్రస్ మహానటి సావిత్రి' పుస్తకావిష్కరణ తన చేతుల మీదుగా జరుగడం తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అలాగే ఒక సంవత్సరం నిర్మాతలను, మరో సంవత్సరం దర్శకులను తన బర్త్ డే సందర్భంగా సన్మానించిన తాను ఈసారి అన్ని శాఖలకు చెందిన వారిని సన్మానిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. త్వరలో 'సేవ' పేరుతో ఒక సేవా నిర్మాణ సంస్థ నెలకొల్పి వృద్ధులు, బాల కార్మికులకు సహాయ పడాలని అనుకుంటున్నాననీ, వచ్చే ఏడాది నుంచి సావిత్రి పేరిట ఒక అవార్డును నెలకొల్పుతాననీ ప్రకటించారు. త్వరలో ఓ సంచలన చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తానని చెప్పారు.
Be first to comment on this News / Article!
|