స్ఫూర్తినిచ్చే'నింగి నేల నాదే'
రెండు చేతులు లేని ఓ యువతి స్విమ్మింగ్ లో ఎలా ఛాంపియన్ అయిందనే యాదార్ధ కథాంశంతో రూపొందిన చైనీస్ చిత్రం 'ఇన్విజబుల్ వింగ్స్'. దీనిని తెలుగులో 'నింగి నేల నాదే' పేరుతో అనువదించారు. లీ చింగ్ యావో ప్రధాన పాత్ర పోషించగా, పెంగ్ జెంబి దర్శకత్వం వహించారు. సుజన మీడియా ప్రైవేట్ వర్క్ లిమిటెడ్ పతాకంపై చావ సుధారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చావ సుధారాణి సోమవారం సంస్థ కార్యాలయంలో తెలిపారు. దిల్ రాజు సైతం పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన చిత్రమిదనీ, తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలన్న తపనతో తెలుగులోకి అనువదించామనీ చావా సుధారాణి పేర్కొన్నారు. 6 నుంచి 60 సంవత్సరాల వరకూ అందరూ చాడాల్సిన సినిమా అని అన్నారు. తమ పంపిణీ సంస్థ వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా ఈ చిత్రాన్ని ఇదే నెలాఖరులో విడుదల చేయనున్నట్టు దిల్ రాజు తెలిపారు. వైఫల్యాలు ఎదురైనా దిగులు పడకుండా విజయాన్ని ఎలా సాధించాలో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ ఆదిరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో 'ఆరాటం ముందు ఆటంకం ఎంత' అనే పాటను రాశాననీ, పలు పాఠశాలల్లో ఈ పాటను పాడుకోవడం తనకెంతో సంతోషం కలిగిస్తోందనీ గీత రచయిత చంద్రబోస్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం అందించే అదృష్టం తనకు కలిగిందనీ, చరిత్రలో నిలిచిపోయే చిత్రమిదనీ వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. కష్టపడి విజయం సాధిస్తే అందులో ఉండే ఆనందం చెప్పనలవి కాదని, అదే ఈ చిత్రంలో చూపారని ముఖ్య అతిథిగా పాల్గొన్న అధ్యాపకురాలు సంగీతవర్మ పేర్కొన్నారు. వినోదాన్ని, సందేశాన్ని మిళితం చేసి రూపొందించిన చిత్రమిదని అన్నారు. రచయిత ప్రసాద్, ట్వంటీఫస్ట్ సెంచరీ సంస్థకు చెందిన రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|