'సావిత్రి' పుస్తకావిష్కరణ
నాటికీ, నేటికీ, ఏనాటికీ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానటి సావిత్రి అని దర్శకరత్న దాసరి ప్రశంసించారు. దాసరి బర్త్ డే సందర్భంగా సోమవారంనాడు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో 'ఎ లెజెండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి' అనే పుస్తకావిష్కరణ జరిగింది. న్యూయార్క్ లోని జేమ్స్ విల్లీకి చెందిన ప్రవాసాంధ్రులు వి.ఆర్.మూర్తి, వి.సోమరాజు ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించారు. దీనికి దాసరి ముందుమాట రాయడం విశేషం. దాసరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి అందజేశారు. విజయవాడకు చెందిన మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకులు పరుచూరి విజయలక్ష్మి, మురళితో పాటు డాక్టర్ డి.రామానాయుడు, శ్రీమతి దాసరి పద్మ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సావిత్రి స్మృతులను దాసరి గుర్తు చేసుకుంటూ, సావిత్రి ఎంతో ఆప్యాయంగా తనను తమ్ముడూ అని సంబోధించే వారనీ, ఆమె దర్శకత్వం వహించిన సినిమాకి తాను ఎగ్జిక్యూటివ్ దర్శకుడిగా పనిచేశాననీ చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె మహానటేనని, ఆ క్రెడిట్ ఆమెకే దక్కుతుందనీ శ్లాఘించారు. మహానటి అయినప్పటికీ నిజజీవితంలో నటించడం ఆమెకు రాదనీ, అందువల్లే ఆమె చివర్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ అన్నారు. రచయితలు ఎంతో చక్కగా సావిత్రి జీవిత చరిత్రను ఈ పుస్తకంలో పొందుపరచారని చెప్పారు. ఎనిమిదిన్నర కోట్ల ప్రజలు సావిత్రికి మహానటి బిరుదునిచ్చారని గుర్తుచేశారు. తన పుట్టినరోజునే సావిత్రి పుస్తకావిష్కరణ జరగడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి సావిత్రి పేరిట ఒక అవార్డును తాను నెలకొల్పి ఏటా అందజేస్తానని ప్రకటించారు. దర్శకరత్న దాసరి గొప్పతనాన్ని, మహానటి సావిత్రి నటనా పటిమను 'ఆంధ్రప్రభ' సంపాదకులు విజయబాబు వివరించారు.
Be first to comment on this News / Article!
|