టెక్నీషియన్స్ కి సన్మానం
చిత్ర పరిశ్రమలో తెర వెనుక నుండి సినిమా విజయానికి కృషి చేస్తున్న 24 శాఖలకు చెందిన 134 మంది సాంకేతిక నిపుణలకు దాసరి చేతుల మీదుగా రవీంద్రభారతిలో సత్కారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దాసరి ఉపన్యాసంలో ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎక్కడో పాలకొల్లులో నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను చదువుకునే రోజుల్లో ఫీజులు కూడా కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. డబ్బుల్లేక ఎన్నో కష్టాలను భరిస్తూ వడ్రంగి పని కూడా చేశానని అన్నారు. కష్టపడి కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుందన్నారు. చిత్ర పరిశ్రమలో తనకు ఎవరూ గాడ్ ఫాదర్స్ లేరని, స్వయంశక్తితోనే తాను పైకి వచ్చానని దాసరి అన్నారు. పేదరికమే తనకు జీవితంలో దిశానిర్దేశం చేసిందని, తాను గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా, 148 సినిమాలకు దర్శకత్వం నిర్వహించినా తనలోని దీక్షే విజయానికి కారణమన్నారు. తన చిత్రాలలోని పాత్రలన్నీ సమాజంలో నుంచి, జీవితాలలో నుంచి పుట్టినవేనని చెప్పారు. కొన్ని వేల మంది సాంకేతిక నిఫుణలను, ఆర్టిస్టులను తాను పరిచయం చేశానని వివరించారు. సినిమా అంటే 24 శాఖల సమ్మేళనమని, భవంతికి పునాదులు లాగా ఈ శాఖలు లేనిదే అసలు సినిమానే లేదని అన్నారు.
దాసరి నూతన దర్శకుడి అవార్డును 'కొత్తబంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అందుకున్నారు. అలాగే దాసరి ఉత్తమ దర్శకుడి అవార్డు గమ్యం దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్ కు) లభించింది. దాసరి ఉత్తమ ఫిలిం జర్నలిస్టు అవార్డును బి.ఏ.రాజు అందుకున్నారు. వీరిందరికీ దాసరి చేతుల మీదుగా సత్కారం, ప్రసంశాపత్రాలతో పాటు ఒక్కొక్కరికి లక్షరూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగింది. కాగా పలువురు పేద విద్యార్థులకు ఇదే వేదికపైన లక్ష రూపాయల నగదును కూడా దాసరి అందజేశారు. గేయరచయితలు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నల సీతారామశాస్త్రిలను, దర్శకత్వ విభాగంలోని సి.వి.రంగనాధన్, కె.బి.తిలక్ లను, రచయితలు ముళ్ళపూటి వెంకటరమణ, పూసల వీరవెంకటేశ్వరరావు, త్రిపురనేని మహారధి, సినిమాటోగ్రాఫర్స్ ఎం.వి.రఘు, ఎస్.వెంకటరత్నం, పి.ఎన్.సుందరం, వి.జయరాంలను, ఎడిటర్స్ కోటగిరి గోపాలరావు, జి.జి.కృష్ణారావులను, డబ్బింగ్ ఆర్టిస్టులను, ఆడియో గ్రాఫర్స్ ను, సినీ, టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నీషియన్స్ ను, ఆర్ట్ డైరెక్టర్స్ ను, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ ను, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ ను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ వేడుకల్లో మంత్రిమండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నటులు మురళీమోహన్, ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు ఎం.ఎస్.రెడ్డి, డి.రామానాయుడు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి తదితరలు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|