రచయిత వీరు పోట్ల ఎట్టకేలకు దర్శకుడిగా మారబోతున్నారు. ఆయన గతంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మించిన 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సూపర్ హిట్ చిత్రాలకు రచన చేశారు. ఎం.ఎస్.రాజు బ్యానర్ లో వీరు పోట్ల దర్శకుడిగా పరిచయమవుతారని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. లార్ స్కో పతాకంపై వీరుని దర్శకుడిగా పరిచయం చేయనున్నట్టు లగడపాటి శ్రీధర్ గతంలో ప్రకటించినప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు వీరు నిరీక్షణ ఫలించింది. అనిల్ సుంకర నిర్మించనున్న చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. జూన్ మొదటివరంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మనోజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 'ప్రయాణం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మనోజ్ హీరోగా కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో ఆయన సోదరి మంచు లక్ష్మీప్రసన్న ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ఉండబోతోంది.ఏతావాతా మనోజ్ ఈ ఏడాది హీరోగా మరింత బిజీ కాబోతున్నారు.