అమాయక కృష్ణుడు
'ప్రీ మారిటల్ సెక్స్ తప్పే కదా...నువ్వెందుకు సమర్ధిస్తున్నావు. పోనీ నువ్వు అందుకు ఒప్పుకుంటావా?' అంటూ అమాయకంగా తన కో-స్టూడెంట్ ను ప్రశ్నించిన కథానాయకుడు కృష్ణుడు గుర్తున్నాడు కదూ. 'వినాయకుడు' చిత్ర కథానాయకుడే ఈ కృష్ణుడు. బొద్దుగా, అమాయకత్వం ఉట్టిపడే ముఖకవళికలతో ప్రేక్షకులను మురిపించిన కృష్ణుడు ఆ చిత్ర విజయానికి కూడా కారకుడయ్యాడు. కృష్ణుడిలోని అమాయకత్వం బాగా నచ్చడం వల్లనో ఏమో...పార్వతి గణేష్ అనే తమిళ దర్శకుడు ఇప్పుడు వినాయకుడు హీరోగా 'అమాయకుడు' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తమిళ నిర్మాతలు పలువురు కలిసి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
కృష్ణుడుతో సినిమాలు తీసేందుకు పలువురు దర్శకనిర్మాతలు సైతం ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో కృష్ణుడు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇటీవల మొదలైంది. ఇందులో మళ్లీ 'వినాయకుడు' ఫేమ్ సోనియా కథానాయికగా నటిస్తోంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో 'యమలోకంలో శీనుగాడు' అనే చిత్రం కూడా ప్లానింగ్ లో ఉంది. గతంలో రవితేజతో 'అన్వేషణ ', నాగబాబుతో 'సర్కార్' వంటి చిత్రాలను నిర్మించిన కె.వి.రావు ఈ చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం కూడా సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ భారీ కృష్ణుడు కమ్ వినాయకుడ్ని కథానాయకుడుగా మళ్లీ మళ్లీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|