శంషాబాద్ పోర్ట్ లో 'కరెంట్'
'కాళిదాసు'తో యువతరం ప్రేక్షకులకు అలరించిన నాగార్జున మేనల్లుడు సుశాంత్ మరోసారి సమ్మర్ సీజన్ లో 'కరెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్నేహ ఉల్లాల్ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని చివరి పాట చిత్రీకరణలో ఉంది. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. హైద్రాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ పాటను తాజాగా చిత్రీకరించారు. ఆసక్తికరంగా 10 గంటల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ జరపడం విశేషం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఇంత ఎక్కువ సేపు షూటింగ్ జరిపిన తొలి తొలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
'కరెంట్' చిత్రం తన కెరీర్ లోనే ఓ మైలురాయి అవుతుందనీ, ఈ చిత్రంతో తాను మాస్ అడియెన్స్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ కు సైతం దగ్గరవుతాననీ సుశాంత్ వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించిన సాంగ్ అద్భుతంగా వచ్చిందనీ, పోర్ట్ అందాలు ఈ పాటకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చాయనీ అన్నారు. ఈ చిత్రం ద్వారా తమ ఎయిర్ పోర్ట్ కు మరింత పబ్లిసిటీ వస్తుందనే అభిప్రాయాన్ని విమానాశ్రయ అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కెరీర్ కు మంచి ఇదో మంచి బ్రేక్ అవుతుందనీ, ఈనెలలోనే ఆడియో విడుదల చేసి నెలాఖరులో గానీ, జూన్ ప్రథమార్థంలో గానీ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, షపీ, రఘుబాబు, సుధ, ఝాన్సీ, రష్మీ, కొండవలస తదితరులు నటిస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ, కణల్ కన్నన్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|