'మిత్రుడు'కు పైరసీ
ఈ ఏడాది తొలి క్వార్టర్ లో ఒక హిట్, ఒకటి రెండు యావరేజ్ లు మినహా వరుస ఫ్లాపులతో కుదేలయిన తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ మహమ్మారి మరోసారి పెను సవాలు విసిరింది. 'అరుంధతి', 'బిల్లా', 'మనోరమ' వంటి లేటెస్ట్ రిలీజ్ లు ఇప్పటికే పైరసీ బెడదను ఎదుర్కొంటుండగా, కేవలం వారం రోజులు తిరక్కుండానే అగ్రహీరో బాలకృష్ణ 'మిత్రుడు' సినిమా పైరసీ డీవీడీలు బ్లాక్ మార్కెట్ లోకి తరలిరావడంతో ఆ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు.మహాదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మేడే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణను కొత్తగా చూపించనట్టు టాక్ స్ప్రెడ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు తరలుతున్న తరుణంలో హైద్రాబాద్ లో జరిపిన తనిఖీలో 300కు పైగా 'మిత్రుడు' డీవీడీలు పట్టుబడ్డాయి.
'మిత్రుడు' చిత్రం రోజురోజుకూ ప్రేక్షకాదరణ చూరగొంటూ మంచి కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందనీ, బాలకృష్ణ కొత్తగా కనిపించారనీ, టైటిల్ సాఫ్ట్ గా, కూల్ గా ఉందంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయనీ శివలెంక ప్రసాద్ తెలిపారు. సకుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న తరుణంలో పైరసీ డీవీడీలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన వాపోయారు. తమ సంస్థ కార్యాలయానికి అతి సమీపంలోనే పెద్దఎత్తున 'మిత్రుడు' డీవీలు దొరికాయనీ, 15కు పైగా కాంబినేషన్లతో డీవీడీలు బయటకు వచ్చాయని చెప్పారు. మద్రాసు, బెంగుళురు నుంచి ఈ పైరసీ డీవీలు ప్రతి చోటకూ చేరుకుంటున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. ఫిలించాంబర్ యాంటీ పైరసీ సెల్ ఇప్పుడు విధుల్లో లేనందున ఈ విషయంలో అధికారికంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడటం లేదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పోలీసు శాఖను అప్రమత్తం చేసి పైరసీని అరికట్టి పరిశ్రమను కాపాడాలని కోరారు. బాలకృష్ణ అభిమానులు సైతం పైరసీని అడ్డుకోవాలని, తమకు సమచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 'మిత్రుడు' చిత్రానికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మరో 14 ప్రింట్లు పెంచిన నిర్మాత ఈనెల 15 నుంచి సినిమాలో అదనంగా మరో పాటను చేరుస్తున్నారు.
Be first to comment on this News / Article!
|