రెహ్మాన్ కు సుశీల సన్మానం
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ ను ప్రముఖ గాయని సుశీల సన్మానించనున్నారు. హైద్రాబాద్ లో శనివారంనాడు ఈ సన్మానం జరుపుతున్నట్టు సుశీల తెలిపారు. శుక్రవారంనాడు హోటల్ మారియట్ లో సుశీల, ఆమె మేనకోడలు సంధ్య, తిరుమల గ్రూప్స్ అధినేత అమర్ నాథ్, మా టీవీ ప్రతినిధి తపస్ తదితరులు పాల్గొని ఈ విషయాన్ని తెలియజేశారు.
సుశీల మాట్లాడుతూ, ఆస్కార్ వచ్చిన సందర్భంగా రెహ్మాన్ ను సన్మానించాలనే ఆలోచన కలిగిందనీ, ఆంధ్రలో సన్మానించాలని అనుకుంటున్నట్టు చెప్పగానే ఆయన వెంటనే అంగీకరించారనీ చెప్పారు. రెహ్మాన్ సంగీత సారథ్యంలో తాను పాడినవి తక్కువ పాటలే అయినా, 'ఇద్దరు' చిత్రం ద్వారా తన మేనకోడలు సంధ్యను రెహ్మాన్ గాయనిగా పరిచయం చేశారని అన్నారు. రెహ్మాన్ ను సన్మానించుకునే అవకాశాన్ని తోడ్పాటు అందిస్తున్న అందరికీ తన కృతజ్ఞతలని అన్నారు. ఒక సంగీత దేవత మరో సంగీత దేవుణ్ని సన్మానించుకునే కార్యక్రమం ఇందని సంధ్య పేర్కొన్నారు. కేవలం పదివేల రూపాయలతో మ్యూజిక్ కంపెనీ స్థాపించి ఈ స్థితికి ఎదిగాననీ, ఇందుకు కారణమైన సంగీతాన్ని గౌరవించుకోవాలని అనుకున్నప్పుటు రెహ్మాన్ గుర్తుకు రావడం, ఆయనను సన్మానించుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందని అమర్ నాథ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మా టీవీ మీడియా పార్టనర్ అనీ, ఈ అరుదైన కార్యక్రమాన్ని వీలైనన్ని సార్లు ప్రసారం చేస్తామని తపస్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|