ప్రియమణి 'తూటా' రెడీ
'ద్రోణ ' చిత్రంతో తెలుగులో బికినీ పోటీకి తెరతీసిన గ్లామర్ నటి ప్రియమణి ఇప్పుడు 'ఖాకీ డ్రెస్' లోనూ తన సహచర హీరోయిన్ల కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల కాలంలో స్నేహ, నవనీత్ కౌర్, నమిత వంటి హీరోయిన్లతో వరుస ఖాకీ చిత్రాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో ప్రియమణి లేడీ ఇన్ స్పెక్టర్ గా తమిళంలో రూపొందిన 'తూటా' చిత్రం ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. ఈ చిత్రం తొలికాపీ కూడా సిద్ధమైంది. సీతారామా ఫిలిమ్స్ పతాకంపై వి.పద్మాకరరావు, జడ్చర్ల నాగరాజులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెల్వం దర్శకుడు. జీవన్ కథానాయకుడిగా నటించారు.
తమిళంలో విడుదలైన ఈ చిత్రం నూరురోజులు ప్రదర్శితమైందనీ, తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నామనీ నిర్మాత పద్మాకరరావు తెలిపారు. తొలికాపీ సిద్ధమైందనీ, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. అనాథ బిడ్డను చేరదీసిన ఓ పోలీసు అధికారి తన స్వప్రయోజనాల కోసం అతన్ని గూండాయిజం, రౌడీయిజం వంటి వాటిలో తర్ఫీదు ఇస్తాడనీ, ఒక సంఘటనతో ఆ విషయాన్ని ఆ కుర్రాడు తెలుగు కోవడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుందనీ మరో నిర్మాత నాగరాజు తెలిపారు. ఇది పూర్తి యాక్షన్ కథాచిత్రమనీ, పోలీసు ఇన్ స్పెక్టర్ గా ప్రియమణి మంచి నటన ప్రదర్శించిందనీ, అన్నివర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలో సిబిఐ ఆఫీసర్ గా చరణ్ రాజ్ మరో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాని ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, వనమాలి పాటలు, సురేంద్ర నాథ్ రెడ్డి ఎడిటింగ్, దళపతి శ్రీను ఫైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|