'ఆ ఒక్కడు' ఆడియో రిలీజ్
విలన్ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న అజయ్ ను హీరోగా పరిచయం చేస్తూ టాలీ 2 హాలీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం 'ఆ ఒక్కడు'. గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్.ఎస్.మూర్తి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హోటల్ నోవోటెల్ లో శుక్రవారం రాత్రి జరిగింది. రవితేజ, ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్, మదన్, ఎం.ఎం.కీరవాణి , చిత్ర కథానాయిక మధుమిత, సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు, రామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో క్యాసెట్ ను డి.సురేష్ బాబు ఆవిష్కరించి తొలి ప్రతిని రవితేజకు అందజేశారు. ఆడియో సీడీని కీరవాణి ఆవిష్కరించి రాజమౌళికి అందించారు.
తొలుత మదన్ మాట్లాడుతూ, అజయ్ ను తాను హీరోగా పరియం చేయాలని అనుకున్నాననీ, అయితే అది కార్యరూపంలోకి రాలేదనీ, ఆ ఛాన్స్ మూర్తి అందిపుచ్చుకున్నాడని పేర్కొన్నారు. 'పెళ్లయిన కొత్తలో' చిత్రం నుంచి తనకు టాలీ 2 హాలీతో అనుబంధం ఉందనీ, ఆ చిత్రం ఓవర్ సీస్ హక్కులను వారే పొందారనీ అన్నారు. ఆ సంస్థ తదుపరి చిత్రానికి తాను దరకత్వం వహించబోతున్నానని చెప్పారు. రాజమౌళి మాట్లాడుతూ, తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'స్టూడెంట్ నెంబర్ 1'లో అజయ్ నటించాడనీ, 'సింహాద్రి'లో అవకాశం ఇచ్చినా పాత్ర చిన్నది కావడంతో అజయ్ కాదని అన్నాడనీ, అప్పుడే అతను సరైన ప్లానింగ్ తో వెళ్తున్న విషయాన్ని తాను గ్రహించాననీ అన్నారు. కథానాయకుడిగా తొలి సినిమా విడుదల కాకుండానే ఆయనకు పలు ఆఫర్లు వచ్చాయన్నారు. చంద్రశేఖర్ ఏలేటి వద్ద మూర్తి పనిచేశారనీ, టీమ్ మొత్తానికి ఈ చిత్రంతో మంచి సక్సెస్ లభించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. 'అతనొక్కడే' చిత్రంలో అజయ్ నటన తననెంతో ఆకట్టుకుందనీ, ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాననీ రవితేజ పేర్కొన్నారు. పరిశ్రమలో తన సక్సెస్ కు కారకుడైన ఎస్.ఎస్.రాజమౌళికి తాను రుణపడి ఉంటానని హీరో అజయ్ అన్నారు. 'విక్రమార్కుడు' సినిమా తర్వాత తన దశ తిరిగిందన్నారు. అలాగే దర్శకుడు మూర్తి తనకు చిరకాల మిత్రుడనీ, చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ఆయన మలిచారనీ చెప్పారు. కథానాయకుడిగా తనకు తొలి అవకాశామిచ్చిన నిర్మాతలకు తన కృతజ్ఞతలని అన్నారు. నిర్మాత గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ, గత మూడేళ్లుగా అమెరికాలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను తాము పంపిణీ చేశామనీ, తన సంస్థ నిర్మించిన తొలి చిత్రమిదనీ చెప్పారు. ఈ సినిమాకి మణిశర్మ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారనీ, తమ సంస్థ ద్వితీయ చిత్రంగా జగపతిబాబుతో మదన్ దర్శకత్వంలో 'ప్రవరాఖ్యుడు' చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఈనెల చివరివారంలో 'ఆ ఒక్కడు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. భాస్కర భట్ల , వేదవ్యాస్, కీరవాణి, మధుమిత తదితరులు ఆడియోతో పాటు సినిమా మంచి సక్సెస్ కావాలని అభిలషించారు.
Be first to comment on this News / Article!
|