'మల్లన్న'కు స్వైన్ ఫ్లూ
'అపరిచితుడు' వంటి సంచలన విజయం తర్వాత హీరో విక్రమ్ కు మళ్లీ అలాంటి హిట్ దక్కలేదు. అయితే ఆ కొరతను 'మల్లన్న' (తమిళంలో కందస్వామి) తీరుస్తుందని చియాన్ విక్రమ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏడాదిన్నరకు పైగా నిర్మాణం జరుపుకొన్నఈ చిత్రం వచ్చే జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. సుశీ గణేషన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కలైపులి ధాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం (కందస్వామి) ఆడియోను ఈనెల 17న చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు కూడా 'స్వైన్ ఫ్లూ' ప్రభావం తప్పకపోవడంతో నిర్మాత ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విషయానికి వస్తే...
'మల్లన్న' చిత్రం షూటింగ్ లో ఎక్కువ భాగం విదేశాల్లో జరపడంతో పాటు కీలకమైన సాంగ్స్ కూడా అక్కడే భారీ ఎత్తున చిత్రీకరించారు. ప్రధాన జంట విక్రమ్, శ్రియపై చిత్రీకరించిన ఓ పాటలో 50 మంది మెక్సికన్ డాన్సర్లు నర్తించారు. ఎంత వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ ఆడియో కార్యక్రమానికి ఆ డాన్సర్లందరినీ చెన్నై రప్పించి స్టేజ్ పై ప్రదర్శన ఇప్పించాలని కొద్దికాలంగా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమాదకరమైన 'స్లైన్ ఫ్లూ' జాడలు మెక్సికోలో కనిపించడంతో ఫారిన్ ఎంబసీలు వీసాల జారీ ప్రక్రియను స్లో చేశాయి. దీంతో తమ సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరపాలనుకుంటున్న దర్శకులతో పాటు, వివిధ పనుల నిమిత్తం ఇండియాకి రావాలనుకుంటున్న విదేశీయులకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో మెక్సికన్ డానర్లను 'కందస్వామి' ఆడియోకి రప్పించే అవకాశాలకు గండిపడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను కలైపులి ధాను అన్వేషిస్తున్నారు. మెక్సికన్ డాన్లర్లకు బదులుగా సినిమాలోని మరో పాటలో నర్తించిన ఇటాలియన్ డాన్సర్ల కోసం ప్రయత్నిస్తున్నామనీ, ఇంతవరకూ జరిగిన అన్ని ఆడియో ఫంక్షన్లకు తలదన్నేలా ఈ ఫంక్షన్ ఉంటుందనీ ఆయన చెబుతున్నారు. ఈ ఫంక్షన్ కు అయ్యే ఖర్చు ఓ చిన్న సినిమా బడ్జెట్ తో సమానమని విశ్లేషకుల అంచనా.
Be first to comment on this News / Article!
|